Two Software Engineers: “కూటమి ప్రభుత్వం హయాంలో నకిలీ మద్యం ఏరులై పారుతుంది. దానికి నిదర్శనమే అన్నమయ్య జిల్లా బండ వడ్డీపల్లిలో చోటు చేసుకున్న ఇద్దరు ఐటీ ఉద్యోగుల మరణం.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనికి ఎటువంటి సమాధానం చెబుతుంది? కల్తీ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వ పెద్దలు ఆటలాడుకుంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా విమర్శలు చేసిన టిడిపి నాయకులు ఇప్పుడు దీనికి ఏ సమాధానం చెబుతారు” ఇదిగో ఇలా కొద్ది రోజులుగా సాక్షి మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది.
సాక్షి మీడియా ఆస్థాయిలో వార్తలను ప్రచారం చేయడంతో ఒక రకంగా కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. పకడ్బందీగా మద్యం విక్రయిస్తున్నప్పటికీ.. ఇందులో కల్తీకి ఏమాత్రం ఆస్కారం లేకుండా చూస్తున్నప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాక కూటమి ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకున్నారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపడితే కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చివరికి ఈ వ్యవహారంలో తేలింది ఏంటంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణలో దసరా అయితే ఏ విధంగా నిర్వహిస్తారో.. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి కూడా అదే విధంగా జరుపుకుంటారు. సంక్రాంతికి చుట్టుపక్కల ఉన్న వారంతా స్వగ్రామాలకు వస్తుంటారు. సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఇలా సంక్రాంతి పండుగకు అన్నమయ్య జిల్లా బండ వడ్డేపల్లి గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు మణికుమార్, పుష్ప రాజ్ వచ్చారు. స్నేహితులను కలుసుకున్నారు. ఇదే క్రమంలో మద్యం తాగారు. మణికుమార్, పుష్పరాజ్ పోటి పడి మద్యం తాగారు. సంక్రాంతి రోజున మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7:30 వరకు ఏకంగా 19 బీర్లు తాగారు. ఇలా తాగడం వల్ల వారు పూర్తిగా డిహైడ్రేషన్ కు గురయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మణికుమార్ చనిపోయాడు. పుష్పరాజ్ చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
ఈ వ్యవహారాన్ని వైసిపి మరో విధంగా ప్రచారం చేయడంతో ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపిన నేపథ్యంలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ విషయాన్ని టిడిపి బయటపెట్టింది. “జరిగిన విషయం మరొకటైతే.. వైసిపి అనుకూల మీడియా మరో విధంగా ప్రచారం మొదలుపెట్టింది. కానీ అసలు వాస్తవం ఇది అని” టిడిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో బండవడ్డిపల్లిలో చోటు చేసుకున్న ఘటనలో అసలు నిజాలు బయటికి వచ్చాయి.
