Anil Kumar: నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు ఈసారి స్థాన చలనం తప్పడం లేదు. ఆ నియోజకవర్గంలో నుంచి అనిల్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పిలిచి మరి క్యాబినెట్లో చేర్చుకున్నారు. కీలకమైన జలవనరుల శాఖను అప్పగించారు. జగన్ కు ఇష్టమైన నాయకుడిగా అనిల్ గుర్తింపు పొందారు. జగన్ కోసం ప్రాణాలైనా ఇస్తానని పదేపదే ప్రకటిస్తుంటారు. అటువంటి నాయకుడికి ఈసారి స్థానచలనం తప్పదని తెలుస్తుండడం విశేషం.
అయితే మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడతానని అనిల్ భావిస్తున్నారు. కానీ ఆయనకు పరిస్థితి అంత అనుకూలంగా లేదని హై కమాండ్ కు నివేదికలు అయితాయి. సహజంగా దూకుడు స్వభావంతో ఈ స్థాయికి ఎదిగిన ఆయన.. అదే దూకుడుతో ఏరి కోరి కష్టాలు తెచ్చుకున్నారు.సొంత పార్టీ నేతలే ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు, వైసీపీ జిల్లా కన్వీనర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో అనిల్ కుమార్ కు పడడం లేదు. ఒకవేళ నెల్లూరు సిటీ నుంచి అనిల్ టికెట్ ఇస్తే.. తాను ఎంపీగా పోటీ చేయనని వేమిరెడ్డి తేల్చి చెబుతున్నారు. ఇప్పుడు నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేయడం వైసిపికి ముఖ్యం. దీంతో అనిల్ ను తప్పించడానికి జగన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది
ఇంకోవైపు టిడిపి నుంచి మాజీ మంత్రి నారాయణ నెల్లూరు సిటీ నుంచి మరోసారి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆయనకు సానుకూలంగా ఉన్నట్లు సర్వేలు తేల్చి చెబుతున్నాయి. గత ఎన్నికల్లో తక్కువ ఓట్లతోనే ఆయన ఓటమి చవిచూశారు. ఆయనపై ప్రజల్లో సానుభూతి కనిపిస్తోంది. మరోవైపు వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అనిల్ అయితే ఓటమి తప్పదని సర్వే నివేదికలు తేల్చాయి. దీంతో అనిల్ ను తప్పించాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే అనిల్ లాంటి నేతను వదులుకునేందుకు జగన్ సిద్ధపడటం లేదు. ఆయనకు ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరి కి పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కనిగిరి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మధుసూదన్ యాదవ్ ఉన్నారు. ఆయనను మరోసారి కొనసాగించే పరిస్థితి లేదు. అందుకే అదే సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ ను కనిగిరి నుంచి బరిలో దింపాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో రెడ్ల ఓట్లు 60000, యాదవుల ఓట్లు 25000 ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అనిల్ కుమార్ యాదవ్ అయితే సునాయాసంగా విజయం సాధించగలరని జగన్ నమ్ముతున్నారు. అయితే ఆరు నూరైనా తాను నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తానని పలుమార్లు అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. ఇప్పుడు జగన్ నిర్ణయానికి ఒప్పుకుంటారా? లేదా? అన్నది చూడాలి.