Shock for TDP : తెలుగుదేశం పార్టీకి( Telugu Desam Party) భారీ షాక్. ఆ పార్టీ సీనియర్ నేత ఒక్కరు గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేశారు. నేరుగా అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. ఇప్పటివరకు విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేతలనే చూసాం. తొలిసారిగా అధికార పార్టీకి చెందిన నేత గుడ్ బై చెప్పడం విశేషం. అది కూడా ఉమ్మడి కడప జిల్లాకు చెందిన నేత కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహానాడు జరిగి పది రోజులు కాకమునుపే.. కడప జిల్లాకు చెందిన నేత రాజీనామా చేయడం అంతటా చర్చకు దారితీస్తోంది. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పార్టీకి రాజీనామా చేశారు. రాజంపేట నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు, తన తండ్రి పాలకొండ్రాయుడు మరణం పై అధినేత చంద్రబాబు స్పందించకపోవడం, కనీసం పరామర్శించకపోవడంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
* 2024 ఎన్నికల్లో ఓటమి
2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు సుగవాసి సుబ్రహ్మణ్యం( sugavasi Subramanyam ). రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభంజనం సృష్టించినా రాజంపేటలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అయితే ఎన్నికలకు ముందు, తరువాత పార్టీలో వర్గ విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో మూడు గ్రూపులు ఉన్నాయని తెలుస్తోంది. రాజంపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రాజు, మాజీ ఎమ్మెల్సీ చంగల్ రాయుడు, సుఖవాసి సుబ్రహ్మణ్యం లు మూడు గ్రూపులుగా విడిపోయినట్లు సమాచారం. అయితే ఓడిపోయిన తర్వాత సుగవాసి సుబ్రహ్మణ్యానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఇది ఆయన వర్గంలో అసంతృప్తి రేపింది. అందుకే రాజీనామా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
Also Read : కేసులుంటే కొడతారా.. సీనియర్ జర్నలిస్ట్ బాధ!
* సుదీర్ఘ రాజకీయ నేపథ్యం..
మరోవైపు సుబ్రహ్మణ్యం తండ్రి పాలకొండ్రాయుడు( palakondarayudu ) ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. సుదీర్ఘ కాలం పాటు ఆయన టిడిపిలో కొనసాగారు. అటువంటి నేత చనిపోతే అధినేత చంద్రబాబు స్పందించలేదనేది సుబ్రహ్మణ్యం వర్గీయుల ఆవేదన. పాలకొండ్రాయుడు 1978 ఎన్నికల్లో రాయచోటి నుంచి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో టిడిపి ప్రభంజనం వీచింది. కానీ ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం టిడిపిలో చేరారు. 1984 సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 1999, 2004 ఎన్నికల్లో వరుసగా రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రాజకీయ వారసుడిగా తెరపైకి వచ్చారు సుగవాసి సుబ్రహ్మణ్యం. 2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తరువాత సుబ్రహ్మణ్యం కొద్దిరోజులపాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తరువాత పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.
* ఎంపీ టికెట్ ఆశించి..
సుగవాసి సుబ్రహ్మణ్యం రాజంపేట( Rajampet ) ఎంపీ టికెట్ ఆశించారు. అయితే అనూహ్యంగా పొత్తులో భాగంగా ఆ సీటును బిజెపికి కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ నుంచి పోటీ చేశారు. కానీ తక్కువ ఓట్లతో ఓటమి చవిచూశారు. అయితే రాయచోటి నియోజకవర్గానికి చెందిన సుగవాసి సుబ్రహ్మణ్యం కు రాజంపేట అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. అక్కడ వర్గ పోరుతోనే ఆయన ఓటమి చవిచూసినట్లు తెలుస్తోంది. అయితే ఓడిపోయిన తర్వాత రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎవరనే విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. మరోవైపు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వర్గ విభేదాలు పెరుగుతున్నాయి. ఇంకోవైపు పార్టీలో తగినంత గుర్తింపు లేకపోవడంతోనే సుగవాసి సుబ్రహ్మణ్యం రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటారా? లేకుంటే వేరే పార్టీలో చేరుతారా? అన్నది కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది