Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh - Shiva : కువైట్ నుండి ఏపీకి వచ్చేసిన శివ.. కూతురు ఏమోషనల్.....

Andhra Pradesh – Shiva : కువైట్ నుండి ఏపీకి వచ్చేసిన శివ.. కూతురు ఏమోషనల్.. వీడియో వైరల్

Andhra Pradesh – Shiva  : ఎడారి దేశంలో ఆ తండ్రి పడిన బాధ వర్ణనాతీతం. చుట్టూ నిలువ నీడ లేక.. మాట కరువై.. గుండె బరువై.. ఆ తండ్రి పడ్డ బాధ అంతా ఇంతా కాదు. రక్షించేవారు లేక.. రక్షణ కరువై.. ఆ తండ్రి ఆర్తనాదాలు పిల్లల చెవిలో కదులుతూనే ఉన్నాయి. తండ్రి క్షేమంగా వస్తాడా? రాడా? అన్న భయంతో బితుకు బితుకుగా గడిపిన ఆ పిల్లలు.. తండ్రిని చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. గుండెలకు హత్తుకొని తమలో ఉన్న బాధను కన్నీటి ద్వారా వ్యక్తపరిచారు. ఈ దృశ్యం రేణిగుంట విమానాశ్రయంలో బుధవారం వెలుగు చూసింది. వైరల్ అంశంగా మారింది.

అన్నమయ్య జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి కువైట్ లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అక్కడ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తీసుకెళ్లిన ఏజెంట్.. చెప్పిన పని కాకుండా.. ఎడారిలో బాతులు, గొర్రెలకు మేత వేసే పనిలో పెట్టాడు. గత కొద్దిరోజులుగా ఇబ్బంది పడుతున్న శివ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలియజేశాడు. అక్కడ తనకు ఎదురైన ఇబ్బందులను వీడియోలో చూపించాడు. తనను ఎడారి దేశంలో వదిలేసారని.. అక్కడ జంతువులకు ఆహారం పెట్టడమే తన పని అని చెప్పుకున్నాడు. చుట్టుపక్కల ఎక్కడా ఒక చెట్టు కూడా లేదని.. కనీసం తాగేందుకు నీళ్లు లేవని కూడా చెప్పుకొచ్చాడు. పట్టించుకోవడం మానేశారని ఆవేదన వ్యక్తపరిచాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. ఏపీ మంత్రినారా లోకేష్ వెంటనే స్పందించారు. బాధితుడిని రక్షిస్తామని భరోసా ఇచ్చారు. భారత విదేశాంగ శాఖ తో మాట్లాడారు. కువైట్లో టిడిపి ఎన్నారై విభాగం ప్రతినిధులను సైతం అలర్ట్ చేశారు. దీంతో శివకు విముక్తి కలిగింది.

కొద్ది రోజుల కిందటే శివ కువైట్ వెళ్ళాడు. ఆయనకు భార్య శంకరమ్మ తో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సొంత ఊరిలో ఉపాధిగిట్టుబాటు కాక.. ఓ ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్ళాడు శివ. స్వగ్రామంలో ఇటీవలే ఒక ఇంటిని నిర్మించాడు. 5 లక్షల రూపాయలు అప్పులు చేశాడు. పిల్లలిద్దరూ చదవడానికి కూడా ఇబ్బందిగా మారింది. అటు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ప్రారంభమైంది. అందుకే కువైట్ వెళ్లి నాలుగు డబ్బులు సంపాదించుకుందామని ఆలోచన చేశాడు. కానీ ఏజెంట్ చేతిలో మోసపోయాడు. ఈ తరుణంలో కువైట్ నుంచి వెనక్కి వచ్చేందుకు కూడా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాడు. వెనక్కి రావాలంటే 50 వేల రూపాయలు చెల్లించాలని ఏజెంట్ డిమాండ్ చేశాడు. ఇప్పటికేఅప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడిఉండడంతో.. కొత్త అప్పులు పుట్టక భార్య సైతం చేతులెత్తేసింది. తండ్రి పరిస్థితిని తలుచుకొని ఇద్దరు కుమార్తెలు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపడంతో శివ స్వస్థలానికి చేరుకున్నాడు.

కువైట్ నుంచి బయలుదేరిన శివ.. ఎంబసీ అధికారుల సాయంతో రేణిగుంట విమానాశ్రయంలో దిగాడు. అప్పటికే భార్య శంకరమ్మ తో పాటు ఇద్దరు పిల్లలు శివ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. పెద్ద కుమార్తె వయసు 18 సంవత్సరాలు దాటుతుంది. తండ్రి అల్లంత దూరంలో ఉండగా తీవ్ర భావోద్వేగానికి గురైన పెద్ద కుమార్తె.. తండ్రిని హత్తుకొని బోరున విలపించింది. భార్య శంకరమ్మ సైతం భర్తను పట్టుకొని కన్నీరు మున్నీరయింది. చిన్న కుమార్తెను చూసి ఒక్కసారిగా రోదించాడు శివ. నా పిల్లల కోసమే అంత దూరం వెళ్లానని.. ఆ పిల్లలని చూస్తానని నమ్మకం లేకపోయిందని.. అసలు ఇండియాకు వస్తానా?రానా? అని భయపడ్డానని.. ఎడారిలో తనువు చాలిస్తానన్న భయం వెంటాడిందని పిల్లలను పట్టుకుంటూ రోదిస్తూ చెప్పాడు శివ. ఆ పిల్లలు తండ్రి కోసం తపించిన పరిస్థితులు, తండ్రిని చూసి ఎమోషన్ అయిన దృశ్యాలను చూసిన ప్రయాణికులు కన్నీటి పర్యంతమయ్యారు. అటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని ఆకాంక్షించారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular