Homeఆంధ్రప్రదేశ్‌Vinukonda : వినుకొండలో దారుణం.. హత్యకు గురైంది వైసీపీ నేత.. మరి చంపింది ఎవరు? రాష్ట్రపతికి...

Vinukonda : వినుకొండలో దారుణం.. హత్యకు గురైంది వైసీపీ నేత.. మరి చంపింది ఎవరు? రాష్ట్రపతికి విపక్షం ఫిర్యాదు

Vinukonda :  పల్నాడు జిల్లా మరోసారి రక్తసిక్తం అయ్యింది. వినుకొండలో వైసీపీ యువజన విభాగం నాయకుడు షేక్ రషీద్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.దీనిపై ఉద్యమించడానికి వైసిపి సిద్ధపడుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన విధ్వంస ఘటనలు,హత్యలు, అత్యాచార ఘటనలకు సంబంధించి రాష్ట్రపతికి వివరించాలని వైసీపీ నిర్ణయించింది.

వైసిపి నాయకుడు రషీద్ ను వినుకొండలో జిలానీ అనే వ్యక్తి నడిరోడ్డుపై నరికి చంపాడు. ముందుగా చేతులు నరికేశాడు. మెడ పై పలుమార్లు కత్తితో నరికాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ దాడిలో రషీద్ చేతులు తెగిపోయాయి. మెడపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేసింది.చంద్రబాబు, పవన్ సారధ్యంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరాక రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించయని విమర్శలు చేసింది. వినుకొండలో పార్టీ నాయకుడు షేక్ రషీద్ హత్య ఉదంతం పరాకాష్టగా పేర్కొంది.

ఈ ఘటనపై టిడిపి సైతం స్పందించింది. ఎదురుదాడికి దిగింది. నిందితుడు తమ పార్టీ వాడు కాదని తేల్చి చెప్పింది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో సైతం ఇలాంటి ప్రచారమే చేశారని గుర్తు చేసింది. వివేకానంద రెడ్డిని చంద్రబాబు చంపించాడని ప్రచారం చేసిన నీచ చరిత్ర వైసీపీదని.. ఏది జరిగినా ముందు టిడిపి మీద తోసేస్తున్నారంటూ ఆరోపించింది. అతడుతోపాటు హత్య చేసిన వాడు ఇద్దరూ వైసీపీ వాళ్లేనని తేల్చి చెప్పింది. వీరిద్దరూ వినుకొండలో రౌడీగా చలామణి అవుతున్న వైసీపీ నేత పిఎస్ ఖాన్ కు ప్రధాన అనుచరులుగా పేర్కొంది. పిఎస్ ఖాన్ వైయస్ జగన్ కు ప్రధాన అనుచరుడని ఆరోపిస్తోంది తెలుగుదేశం పార్టీ. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని కూడా చెప్పుకొస్తోంది.

గత ఐదేళ్ల వైసిపి పాలనలో రౌడీయిజం పెరిగిందని.. ఆ మదాన్ని దించుతామని.. గంజాయిని అరికడతామని.. వైసీపీ సైకోలు చేసే దారుణాలను ఆపుతామని టిడిపి స్పష్టం చేసింది. టిడిపి ఇచ్చిన ఈ ప్రకటనపై వైసీపీ స్పందించింది. జిలానిని కరుడుగట్టిన టిడిపి కార్యకర్తగా అభివర్ణించింది. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వినుకొండలో అతను చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావని.. టిడిపి నేతల అండదండలతో విధ్వంసాలకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. టిడిపి పెద్దలతో నిందితుడు జిలానీ తిరుగుతున్న ఫోటోలను వైసిపి షేర్ చేసింది. ప్రస్తుతం ఇవే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పోలింగ్ కు ముందు, తరువాత పల్నాడులో విధ్వంస ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. హింసాత్మక ఘటనలు జరిగాయి. చివరకు ఎలక్షన్ కమిషన్ స్పందించింది. కేంద్ర బలగాలను పంపించింది. అయినా సరే పరిస్థితులు సద్దుమణగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వివాదాలు సమసిపోయాయి. పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఈ ఘటన జరిగింది. దీనిపై జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ హత్య వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. రాజకీయ పార్టీల ప్రమేయం ఉన్నట్లు ప్రస్తుతానికి కనిపించట్లేదు అన్నారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత కక్షల వల్లే జరిగిందని చెప్పుకొచ్చారు. జిల్లాలో శాంతిభద్రతలకు సమస్య లేకుండా చూస్తామని ఎస్పీ ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా 144 సెక్షన్ విధిస్తున్నట్లు తెలిపారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version