YS Sharmila: శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ షర్మిల షాకింగ్ ఎంట్రీ ఇచ్చారు. సడన్ గా ఆర్టీసీ బస్సులో కనిపించారు. పీసీసీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆమె రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. తొలుత శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి పర్యటన ప్రారంభించాలని భావించారు. అందులో భాగంగా ఇచ్చాపురం వెళుతుండగా ఆర్టీసీ బస్సు కనిపించింది. తన కాన్వాయ్ ని ఆపి ఆమె ఆర్టీసీ బస్సు ఎక్కారు. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమె బస్సు ఎక్కి ప్రయాణికులతో మమేకం అయ్యేందుకు ప్రయత్నించారు. అయితే తొలుత ముభావంగా స్పందించిన వారు.. ఆ తరువాత షర్మిలతో సరదాగా మాట్లాడారు. షర్మిల అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.
శ్రీకాకుళం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన షర్మిలకు పలాస వద్దకు వచ్చేసరికి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు కనిపించింది. వెంటనే తన కాన్వాయ్ ని ఆపి.. ఆమె బస్సు ఎక్కారు. ఆమెతో పాటు కాంగ్రెస్ నేతలు మాణిక్కం ఠాకూర్, గిడుగు రుద్రరాజు, రఘువీరా రెడ్డి సైతం బస్సు ఎక్కారు. పలాస నుంచి ఇచ్చాపురం వరకు ఆమె బస్సు లోనే ప్రయాణం చేశారు. షర్మిల తో పాటు కాంగ్రెస్ నాయకులు ప్రయాణికులతో ఉల్లాసంగా గడిపారు. ముఖాముఖి మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు ఇతర వివరాలను షర్మిల ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. తాను రాజశేఖర్ రెడ్డి బిడ్డనని చెప్పడంతో మహిళా ప్రయాణికులు ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు. ఇప్పటివరకు టీవీల్లో కనిపించిన షర్మిల.. ఒకేసారి కళ్ళ ముందుకు రావడంతో కొంతమంది ఆశ్చర్యపోయారు. ఆమెతో మాట్లాడేందుకు ఆసక్తి కనబరిచారు.
బస్సులో ప్రయాణిస్తున్న ఆమె చివరిగా మీడియాతో మాట్లాడారు. వై వి సుబ్బారెడ్డి తనను పక్క రాష్ట్రం నుంచి వచ్చిన నేతగా పేర్కొనడాన్ని షర్మిల ప్రస్తావించారు. తాను జగన్ రెడ్డి అనడం వై వి సుబ్బారెడ్డి కి నచ్చలేదని, అందుకే ఇకనుంచి జగనన్న గారు అని పిలుస్తానని చెప్పుకొచ్చారు. తాము చేసిన అభివృద్ధి షర్మిలకు కనిపించడం లేదా అన్న కామెంట్స్ పై కూడా స్పందించారు. మీ అభివృద్ధి చూపించడానికి సిద్ధమైతే తాను వస్తానని.. మీడియా కూడా వస్తుందని.. డేటు, టైం చెప్పాలని షర్మిల సవాల్ విసిరారు. మీరు చేసిన అభివృద్ధి ఏమీ లేదని.. రాజధాని ఎక్కడ అని ప్రశ్నించారు. మొత్తానికి అయితే జిల్లాల పర్యటన తొలి రోజునే షర్మిల ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఈరోజు నుంచి నెలాఖరు వరకు జిల్లాల పర్యటన చేయనున్నారు. రోజుకు రెండు నుంచి మూడు జిల్లాల పర్యటన కొనసాగనుంది. ఈరోజు శ్రీకాకుళం తో పాటు విజయనగరం జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది.