YS Sharmila: నిన్నటిదాకా మాటల తూటాలు పేలిన ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా టర్న్ తీసుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడి నేపథ్యంలో సానుభూతి, పరామర్శలతో హోరెత్తుతున్నాయి. జగన్ పై నిన్న దాడి జరగగానే ఏపీ ప్రతిపక్ష నాయకుడు, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ఎక్స్ వేదికగా పరామర్శించారు. జగన్ పై జరిగిన దాడిని ఖండించారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదేవిధంగా స్పందించారు. ఇతర నాయకులు కూడా జగన్ పై చేసిన దాడిని ఖండించారు. అయితే ఈ జాబితాలో ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు, జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు షర్మిల భిన్నంగా స్పందించారు. దాడి జరిగిన అనంతరం.. ఆమె ట్విట్టర్ ఎక్స్ వైదికగా ఒక ట్వీట్ చేశారు. ” ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఈరోజు జరిగిన దాడి బాధాకరం, దురదృష్టకరం. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం. ఎవరైనా కావాలని చేసి ఉంటే, ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే. జగన్ గారు త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను.” అంటూ షర్మిల చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాశంగా మారింది.
జరిగిన ఘటనను కావాలని చేశారని వైసీపీ నాయకులు అంటుంటే.. షర్మిల మాత్రం “ప్రమాదవశాత్తు జరిగిందని అనుకుంటున్నాం” అని ట్విట్ చేశారు. ఇదే సందర్భంలో ” ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఖండించాల్సిందే” అంటూ మరో వాక్యంలో పేర్కొన్నారు.. షర్మిల చేసిన ట్వీట్ ప్రకారం ఆమెకు ఇంకా జగన్మోహన్ రెడ్డి పై కోపం తగ్గలేదని.. ఆమె చేసిన ట్వీట్ లోనూ అదే ప్రతిబింబిస్తోందని ఏపీ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత కొంతకాలంగా షర్మిలకు, వైయస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తరఫున వైయస్ షర్మిల ప్రచారం చేశారు. ఎన్నికల్లో విజయం అనంతరం షర్మిలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తారనే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ షర్మిల ను దూరం పెట్టారనే వార్తలు వచ్చాయి. ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయనే విమర్శలు వినిపించాయి. ఆ తర్వాత అవన్నీ నిజమేనని షర్మిల తన చేతల ద్వారా నిరూపించారు. తెలంగాణలో సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. అనంతరం ఎన్నికల్లో ఆమె తన మద్దతును కాంగ్రెస్ పార్టీకి ప్రకటించారు. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. తర్వాత ఆమె తెలంగాణ రాజకీయాల నుంచి ఆంధ్రా కు షిఫ్ట్ అయిపోయారు. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు.. ఇక నాటినుంచి నేటి వరకు జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆయన ప్రభుత్వ పనితీరును ఎండగడుతున్నారు.
ఇక జగన్ పై దాడి జరిగిన నేపథ్యంలో షర్మిల ట్వీట్ మరో విధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యల్లో రెండు రకాల కోణాలు కనిపిస్తున్నాయని.. ఒకటి ఈ సంఘటన దూరదృష్టవశాత్తు జరిగిందని.. ఒకవేళ ఈ సంఘటన వెనుక ఎవరైనా ఉంటే.. కచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నట్టు ప్రస్ఫుటమవుతోందని వారు అంటున్నారు. ఇప్పటికే ఈ ఘటన వెనుక జగన్మోహన్ రెడ్డి మనుషులు ఉన్నారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు ఇదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పై కోడి కత్తితో ఒక వ్యక్తి దాడి చేశాడు. ఆ ఎన్నికల్లో దానిని వైసీపీ సానుభూతి అంశంగా వాడుకుంది. అప్పుడు ఎన్నికల్లో విజయం కూడా సాధించింది. అయితే ఈ ఐదు సంవత్సరాలు ఆ కేసు కు సంబంధించి కోర్టుకు ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. ఆ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి ఇంతవరకు విడుదల కాలేదు. వీటన్నింటినీ ఉదాహరించుకుంటూ టిడిపి నాయకులు వైసిపి పై విమర్శలు చేస్తున్నారు. వారి విమర్శలకు తగ్గట్టుగానే షర్మిల ట్వీట్ చేశారని ఏపీలోని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇది ఏమైనప్పటికీ తన సోదరుడిపై షర్మిలకు ఇంకా కోపం తగ్గలేదని.. అందుకు ఆమె చేసిన ట్వీట్ ఉదాహరణ అని వారు చెబుతున్నారు.