Jagan And Sharmila: ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది. సీఎం జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ పగ్గాలు అందుకోనున్నారు. జగన్ పై ఫైట్ తప్పదని సంకేతాలు పంపారు.సరిగ్గా ఇదే సమయంలో జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొద్దిరోజుల కిందట ప్రమాదానికి గురైన కెసిఆర్ కు ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో చంద్రబాబు నేరుగా వెళ్లి పరామర్శించారు. కానీ జగన్ వెళ్లకపోవడం పై రకరకాల కామెంట్స్ వినిపించాయి. చాలా రోజుల తరువాత ఇప్పుడు జగన్ వెళ్లి పరామర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
జగన్ కు కెసిఆర్ రాజకీయ మిత్రుడిగా కొనసాగుతున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు.. చంద్రబాబుకు శత్రువుగా ఉన్న కెసిఆర్ తో జగన్ మిత్రుడిగా కొనసాగారు. 2019 ఎన్నికల్లో కెసిఆర్ జగన్ కు అన్ని విధాలా సాయం చేశారు. గత ఐదు సంవత్సరాలుగా వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 2021 లో వైఎస్సార్ తెలంగాణ పార్టీని షర్మిల ఏర్పాటు చేశారు. కెసిఆర్ సర్కార్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఒకటి రెండుసార్లు కేసీఆర్ సర్కార్ ఆమెపై కర్కశంగా వ్యవహరించింది. ఆ సమయంలో సైతం జగన్ స్పందించలేదు. పైగా తెలంగాణ రాజకీయాలతో మాకు సంబంధం ఏమిటని సజ్జల రామకృష్ణారెడ్డి తో ఒక ప్రత్యేక ప్రకటన ఇప్పించారు. షర్మిల తెలంగాణ రాజకీయాల వైపు వెళ్లిన తర్వాత కేసీఆర్ ను జగన్ కలిసిన సందర్భాలు కూడా తక్కువే. అటు షర్మిల సైతం రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి టీ తాగుతారని, విందులు చేసుకుంటారని, కానీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపరని చాలా సందర్భాల్లో అటు జగన్ తో పాటు ఇటు కేసీఆర్ పై విమర్శలు చేశారు. మొన్నటి ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని, బీఆర్ఎస్ కు ఎటువంటి లబ్ధి ఉండకూడదు అని తన పార్టీని పోటీ నుంచి తప్పించారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు.
షర్మిల తన ఉమ్మడి శత్రువులుగా కేసీఆర్ తో పాటు జగన్ ను భావించారు. తొలుత తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కావాలని అనుకున్నారు. కానీ వీలుపడలేదు. అందుకే ఇప్పుడు ఏపీపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు అందుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కుటుంబాల్లో చీలిక తెచ్చి కుట్రలు, కుతంత్రాలు అమలు చేస్తారని ప్రకటించారు. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు తీసుకోనున్న నేపథ్యంలోనే సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఢిల్లీలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలోనే.. జగన్ హైదరాబాదులో ప్రత్యక్షమయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు. అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ పైన వీరిద్దరూ చర్చించి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. షర్మిలను ఎలా నియంత్రించాలో కెసిఆర్ సలహాలను జగన్ తీసుకొని ఉంటారని టాక్ నడుస్తోంది. తెలంగాణలో కెసిఆర్ కు కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉంది. ఇప్పుడు షర్మిల చేరికతో ఆ పార్టీ ఏపీలో సైతం జగన్ కు వ్యతిరేకంగా మారనుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఇద్దరి నేతలకు ఇప్పుడు షర్మిల ఉమ్మడి ప్రత్యర్థిగా మారనున్నారు. అందుకే ఎలా నియంత్రించాలో ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది.