YS Sharmila : వైఎష్ షర్మిళ మానసికంగా సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇందు కోసం కీలక చర్చలు జరిపేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీతో సమావేశం కానున్నారు. తన పార్టీ విలీనం, కాంగ్రెస్ పార్టీలో తన పాత్ర వంటి అంశాలపై స్పష్టత తీసుకోనున్నారు. షర్మిళ కాంగ్రెస్ లో చేరికతో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశముంది. ముఖ్యంగా ఇది సీఎం జగన్ కు మింగుడుపడని అంశం. ఆ పార్టీ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోక తప్పదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. బీజేపీ నేత ఒకరు ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడవే వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని చెబుతూ వైఎస్ షర్మిళ వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. సుదీర్ఘ కాలం పాదయాత్ర చేశారు. బీఆర్ఎస్ పార్టీపై సమరశంఖం పూరించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేశారు. కానీ అవేవీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. ఇప్పటికే రెండు జాతీయ పార్టీలతో పాటు బీఆర్ఎస్ విస్తరణతో ఆ సంఖ్య తెలంగాణలో మూడుకు చేరింది. వాటితో సరితూగడం, ప్రభావం చూపడం షర్మిళకు కత్తిమీద సాములా మారింది. అందుకే వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్ లో తన పాత్ర ఏమిటన్నదానిపై క్లారిటీ వచ్చాక.. తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.
షర్మిళను కాంగ్రెస్ లో చేర్చుకొని ఏపీలో ఆమె సేవలను వినియోగించుకోవాలన్నది హైకమాండ్ పెద్దల ఆలోచన. షర్మిళ మాత్రం తాను తెలంగాణ వదిలేది లేదని చెబుతున్నారు. ఇప్పటికే ఆమె పీలేరు నుంచి పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్కడే స్థిర నివాసం ఏర్పాటుచేసుకునేందుకు ఇల్లు కూడా కొనుగోలు చేశారు. అయితే దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆమె డీకే శివకుమార్ ద్వారా హైకమాండ్ తో చర్చలు జరుపుతున్నారు. ఈ రోజు కానీ.. రేపు కానీ ఆమె ఢిల్లీ వెళ్లనున్నారు. అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలతో చర్చించనున్నారు. తన అభిప్రాయాలను వారి ముందు ఉంచనున్నారు.
ఒక్క షర్మిళ చేరికతో అది ఆగదని.. వైఎస్ కుటుంబంలో మెజార్టీ సభ్యులు కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశముంది. అదే జరిగితే జగన్ కు తీరని నష్టం. షర్మిళ, విజయమ్మ, సోనియా, రాహుల్, ప్రియాంకలు ఒకే వేదికపైకి వస్తే వైసీపీ పతనం మొదలవుతుందని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి చెబుతున్నారు. అయితే తాను తెలంగాణ బిడ్డనని.. తెలంగాణకే పరిమితమవుతానని షర్మిళ చెబుతున్నారు. హైకమాండ్ తో చర్చలు జరిగిన తరువాత దీనిపై క్లారిటీ రానుంది. తన పార్టీని విలీనం చేయడానికి ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి కాంగ్రెస్ లో షర్మిళ చేరడం ఖాయంగా కనిపిస్తోంది.