YS Sharmila: కడప ఎంపీగా షర్మిల.. 25న ప్రకటన

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో తొలి పేరు షర్మిల దేనని తెలుస్తోంది. ఆమె కడప ఎంపీ సీటు నుంచి పోటీ చేయడం ఖాయంగా తేలుతోంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా వైయస్ అవినాష్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే.

Written By: Dharma, Updated On : March 18, 2024 10:57 am

YS Sharmila

Follow us on

YS Sharmila: కడప ఎంపీగా షర్మిల పోటీ చేయనున్నారా? హై కమాండ్ ఒత్తిడి పెంచుతోందా? ఈనెల 25న షర్మిల పేరును ప్రకటించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో అన్ని రాజకీయ పక్షాలు అభ్యర్థులను ప్రకటించాయి. వైసీపీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. తెలుగుదేశం పార్టీకి పొత్తులో భాగంగా దక్కిన 144 స్థానాల్లో.. 128 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. ఇంకా 16 స్థానాలను మాత్రమే పెండింగ్ లో ఉంచారు. బిజెపి, జనసేన సైతం తమ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు వామపక్షాలతో ఇండియా కూటమిగా వెళుతున్న కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన సైతం ఈనెల 25న రానున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో తొలి పేరు షర్మిల దేనని తెలుస్తోంది. ఆమె కడప ఎంపీ సీటు నుంచి పోటీ చేయడం ఖాయంగా తేలుతోంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా వైయస్ అవినాష్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు ఈసారి జగన్ టిక్కెట్ ఇవ్వరని ప్రచారం జరిగింది. వివేక హత్య కేసులో నిందితుడు కావడంతో ప్రతికూల ప్రభావం ఉంటుందని భావించినట్లు వార్తలు వచ్చాయి. కానీ జగన్ అవేవీ పట్టించుకోలేదు. మరోసారి కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి పేరును ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కడప నుంచి షర్మిలను పోటీ చేయిస్తే మంచి ఫలితం ఉంటుందని అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ షర్మిల బరిలో దిగితే హోరా హోరి ఫైట్ నడవనుంది.

షర్మిల విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ హై కమాండ్ మాత్రం కడప అయితేనే మేలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సీఎం జగన్ ఇరకాటంలో పెట్టాలంటే కడపలోనే గట్టిగా కొట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఏకంగా కాంగ్రెస్ అగ్రనేతలే షర్మిలను ఒప్పించినట్లు సమాచారం. రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల వ్యవహారం కొలిక్కి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఈనెల 25న కాంగ్రెస్ అభ్యర్థులతో జాబితా విడుదల అయ్యే అవకాశం ఉంది. అందులో ఏపీకి సంబంధించి తొలి పేరు షర్మిలదేనిని తెలుస్తోంది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి. మరోవైపు వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత సైతం కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే ఆమె కాంగ్రెస్ లో చేరుతారా? లేకుంటే ఇతర పార్టీలో చేరతారా? ఇండిపెండెంట్ గా బరిలో దిగుతారా? అన్నది తెలియాల్సి ఉంది.