CM Chandhrababu: మనుషులకు చాలా రకాల సెంటిమెంట్లు ఉంటాయి. అందులోనూ రాజకీయ నేతలకు అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్ 1 అంటే.. ఏపీ సీఎం చంద్రబాబుకు మరపురాని రోజు.1995లో ఆయన సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నాడు సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా రికార్డ్ సాధించారు. 1995లో ఆగస్టు సంక్షోభం టిడిపిని కుదిపేసింది. నాడు లక్ష్మీపార్వతి పెత్తనం ఎక్కువ కావడంతో.. నందమూరి కుటుంబ సభ్యులకు కలిసి చంద్రబాబు ఎన్టీఆర్ పై తిరుగుబాటు బావుట ఎగురవేశారు. పార్టీ ఎమ్మెల్యేలను సైతం తన వైపు తిప్పుకున్నారు. సంపూర్ణ మెజారిటీ సాధించి 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి రాష్ట్రానికి సీఎం అయ్యారు. 2004 వరకు 9 ఏళ్లపాటు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా కొనసాగారు. 1999 ఎన్నికల్లో సైతం గెలిచారు. అప్పటివరకు ఉమ్మడి రాష్ట్రానికి వరుసుగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏలిన వారు లేరు. ఆ ఘనతను అధిగమించారు చంద్రబాబు. అందుకే చంద్రబాబు సెప్టెంబర్ 1 మరుపురాని రోజుగా గుర్తించుకున్నారు. రేపటితో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి 30 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా టిడిపి ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేయాలని డిసైడ్ అయ్యింది.
* నాడు ప్రత్యేక పరిస్థితుల్లో
నాడు ప్రత్యేక పరిస్థితుల్లో చంద్రబాబు సీఎం అయ్యారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో చంద్రబాబు పార్టీలో లేరు. 1978లో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన చంద్రబాబు గెలిచారు. మంత్రి పదవిని సైతం దక్కించుకున్నారు. మంత్రిగా ఉండగానే ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి తో చంద్రబాబుకు వివాహం జరిగింది. తన మామ టిడిపిని ఏర్పాటు చేసినా చంద్రబాబు మాత్రం ఆ పార్టీలో చేరలేదు. 1983లో కాంగ్రెస్ అభ్యర్థిగానే చంద్రబాబు పోటీ చేశారు. కానీ టిడిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల అనంతరం చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ 1985 ఎన్నికల్లో పోటీ చేయలేదు. 1989 ఎన్నికల్లో మాత్రం పోటీ చేసి గెలిచారు. కానీ పార్టీ అధికారంలోకి రాలేదు.
* టిడిపిలో కీలక పాత్ర
1994లో తెలుగుదేశం పార్టీ విజయంలో చంద్రబాబు పాత్ర ఉంది. అప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీపై పూర్తిస్థాయి పట్టు సాధించారు. ఐదేళ్ల కాంగ్రెస్ పాలనపై ఎన్టీఆర్ గట్టిగానే ఫైట్ చేశారు. కానీ లోలోపల వ్యూహాలను మాత్రం చంద్రబాబు రచించారు. 1994 ఎన్నికల్లో అనుకున్నట్టుగానే తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. కానీ లక్ష్మీపార్వతి మితిమీరిన జోక్యంతో నందమూరి కుటుంబం ఇబ్బంది పడింది. పార్టీ ఎమ్మెల్యేలలో సైతం ఒక రకమైన వ్యతిరేకత వచ్చింది. దానిని క్యాష్ చేసుకున్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ పై తిరుగుబాటుబావుట ఎగురవేశారు. పార్టీని హస్తగతం చేసుకున్నారు. సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఎన్నేళ్లు లే అని ప్రత్యర్థులు తక్కువ చేసి చూశారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు. ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇంతటి రాణింపునకు కారణం సెప్టెంబర్ 1 సెంటిమెంట్ అని చంద్రబాబు బలంగా నమ్ముతారు. అందుకే పార్టీ శ్రేణులు సైతం సంబరాలు చేసుకునేందుకు సిద్ధపడుతున్నాయి.
* తరచూ వెన్నుపోటు ఆరోపణ
అయితే ఎన్టీఆర్ కు వెన్నుపోటు అన్న మాటను తరచూ ప్రత్యర్థులు ప్రయోగిస్తూ వచ్చారు. కానీ ఆ వెన్నుపోటు తరువాత 1999 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచారు. 2014లో నవ్యాంధ్రప్రదేశ్లో విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో సైతం సత్తా చాటారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సమయంలో ఎన్నో రకాల సవాళ్లు ఎదురయ్యాయి. అది మూన్నాళ్ళ ముచ్చటేనని విశ్లేషణలు చేశారు. కానీ ఇంతింతై వటుడింతై అన్నట్టు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ కు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా రికార్డు సృష్టించారు చంద్రబాబు. ఆయన తొలిసారిగా సీఎం బాధ్యతలు చేపట్టి రేపటికి 30 ఏళ్లు గడుస్తున్న తరుణంలో సంబరాలు చేసుకునేందుకు టిడిపి సిద్ధపడింది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More