Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు ఊరట లభించింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేశారని ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనకు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు అందించారు. విచారణకు హాజరు కావాలని సూచించారు. అయితే ఆయన తన కేసులను కొట్టివేయాలని కోరుతూ న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. తనకోసం గాలింపు చర్యలు చేపడుతున్న ఏపీ పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వచ్చే వారం వరకు అరెస్టు కాకుండా ఉత్తర్వులు ఇచ్చింది. వైసిపి ప్రభుత్వ హయాంలో రామ్ గోపాల్ వర్మ చాలా దూకుడుగా ఉండేవారు. జగన్ రాజకీయ జీవితాన్ని ఇతివృత్తంగా చేసుకొని వ్యూహం అనే సినిమాను రూపొందించారు. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా మార్ఫింగ్ చేసిన ఫోటోలతో చంద్రబాబు, లోకేష్, పవన్ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టింగులు పెట్టారు. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో పోలీసులు లైట్ తీసుకున్నారు. కూటమి అధికారం చేపట్టిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నాయి. అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ఈ తరుణంలో ప్రకాశం జిల్లా టిడిపి నేత ఒకరు రాంగోపాల్ వర్మ పై ఫిర్యాదు చేశారు. అయితే కేసు విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆయనను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇచ్చింది.
* క్వాష్ పిటిషన్ దాఖలు
వాస్తవానికి రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైన తరుణంలో.. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు కేసును కొట్టివేయడం అనేది జరగదని.. అవసరమైతే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. దీంతో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రామ్ గోపాల్ వర్మ అప్పటినుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అజ్ఞాతంలో ఉంటూనే మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దీంతో రాంగోపాల్ వర్మ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. అయితే ఈ రోజు రాంగోపాల్ వర్మ బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కేసును వచ్చే వారానికి వాయిదా వేస్తూ.. అప్పటివరకు రాంగోపాల్ వర్మను అరెస్టు చేయవద్దని సూచించింది. దీంతో ఆర్జీవికి ఉపశమనం కలిగినట్లు అయింది. అదే సమయంలో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు.
* అరెస్టుపై అనుమానాలు
అయితే ఎట్టి పరిస్థితుల్లో రాంగోపాల్ వర్మను అరెస్టు చేయాలని ఏపీ పోలీసులు ప్రణాళిక రూపొందించారు. అయితే ఆయన ఆచూకీ దొరకకపోవడం మాత్రం మిస్టరీగా మారింది. పైగా ఆయన మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అదెలా సాధ్యమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరోవైపు తెలంగాణలో సైతం అనుకూల ప్రభుత్వం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు.అయినా సరే రాంగోపాల్ వర్మ ఆచూకీ కనుక్కోవడంలో పోలీసులు ఫెయిల్ కావడం విశేషం. ఉద్దేశపూర్వకంగా రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయడం లేదా? లేకుంటే దీని వెనుక వ్యూహం ఏమైనా ఉందా? అన్న అనుమానాలు ఉన్నాయి. ఈ తరుణంలోనే ఏపీ హైకోర్టు వారం రోజులపాటు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వడం విశేషం. తదుపరి విచారణలో కోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుందో చూడాలి.