Sensational developments in AP: ఏపీ ( Andhra Pradesh) విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి మారినట్లు స్పష్టం అవుతుంది. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. అక్కడ బిజెపి సారథ్యం వహిస్తోంది. ఏపీలో టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నడుస్తోంది. ఈ రెండు చోట్ల పరస్పరం బిజెపి, టిడిపి కలిసి ముందుకు సాగుతున్నాయి. అయితే ఏపీ విషయానికి వస్తే ప్రతిపక్ష స్థానంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో బిజెపి ఉదాసీనంగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కొన్ని రకాల వ్యాఖ్యానాలు చేశారు. బిజెపి వైఖరిని తేల్చి చెప్పారు. త్వరలో కొన్ని రకాల సంచలనాలు నమోదవుతాయని కూడా సంకేతాలు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో అందుకు తగ్గ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.
ఈడి నోటీసులు..
మద్యం కుంభకోణం( liquor scam) కేసును ఏపీ సిఐడి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంతమంది అరెస్టులు జరిగాయి. అందులో కొందరు బెయిల్ పై బయటకు వచ్చారు. అలానే సుప్రీంకోర్టు వరకు వెళ్లి అరెస్టును తప్పించుకోవాలని చూశారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. కానీ ఆయనకు అవకాశం దక్కలేదు. అరెస్టు తప్పలేదు. ఎలాగోలా బెయిల్ పై బయటకు వచ్చారు మిథున్ రెడ్డి. కానీ అంతకంటే ముందే ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు విజయసాయిరెడ్డి. ఆయన మాత్రం అరెస్ట్ కాలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన ఈ కేసులో సహకారం అందించడం వల్లే అరెస్టు కాలేదని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ.. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేతలను ఇరకాటంలో పెట్టింది మాత్రం విజయసాయిరెడ్డి. ఇప్పుడు అదే విజయసాయి రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నుండి పిలుపు వచ్చింది. ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని ఈడి నోటీసులు ఇచ్చింది. అది గడవక ముందే ఈరోజు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి సైతం ఈడి నోటీసులు ఇచ్చింది. 23న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది.
పివిఎన్ మాధవ్ స్పష్టత..
అయితే ఇప్పటివరకు వైసీపీ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి భిన్న వైఖరితో ఉందన్న ప్రచారం సాగింది. గత స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ విషయంలో కొంత మినహాయింపు వస్తుందని ఆ పార్టీ నేతలు భావించారు. అందుకే వైసిపి విమర్శలు కేవలం టిడిపి, జనసేనకు మాత్రమే పరిమితం అయ్యేవి. కానీ ఇప్పుడు ఈ డి మద్యం కుంభకోణం కేసులో ఎంట్రీ ఇచ్చింది.. నిందితులుగా ఉన్న వైసీపీ నేతలకు విచారణకు పిలిచింది. బిజెపి మారిన వైఖరిని ఇది స్పష్టం చేస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఈ కేసులో సంచలనాలు నమోదు కాబోతున్నాయని తేల్చి చెప్పారు. దీంతో పొలిటికల్ వర్గాల్లో విస్తృతమైన చర్చ నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
