AP Liquor Scam: మద్యం కుంభకోణం( liquor scam) కేసులో కీలక పరిణామం. ఎవరి ద్వారా అయితే ఇంతటి కుంభకోణానికి పాల్పడ్డారో.. వారే అప్రూవల్ గా మారేందుకు ఏకంగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఇస్తామని కూడా చెబుతున్నారు. అయితే ఇప్పటికే వారు కీలక సమాచారం ఇచ్చారని.. ఇప్పుడు బహిరంగ అరెస్టులు తప్పించుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం వారిచే పిటిషన్లు వేయించిందని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి మద్యం కుంభకోణాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా తేలిగ్గా తీసుకుంది. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపితే అసలు కుంభకోణం ఏంటని ప్రశ్నించింది. అయితే డిస్టలరీలను తమ చేతుల్లోకి తీసుకొని.. బేవరేజెస్ డిపోలను సైతం తమ అదుపులోకి తెచ్చుకొని భారీ కుంభకోణానికి తెర లేపారు అన్నది ప్రభుత్వం నుంచి వస్తున్న అభియోగం. అందుకే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించగా.. దాదాపు 18 వేల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని.. దోచుకున్నారని ప్రాథమిక దర్యాప్తు లో తేలడంతో.. ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దించింది.
* అధికారులను ఏరి కోరి..
2019లో అధికారంలోకి వచ్చింది వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ. అదే ఏడాది అక్టోబర్ రెండు న కొత్త మద్యం పాలసీని ప్రకటించింది. అయితే నేరుగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపింది కానీ.. అప్పటివరకు మద్యం సరఫరా లో ఉన్న వ్యవస్థను తమ కంట్రోల్లో తీసుకున్నారు అప్పటి ప్రభుత్వ పెద్దలు. అయితే ఇందుకు నమ్మకమైన అధికారులను పెట్టుకోవాలని చూశారు. ఎక్కడో రైల్వే ట్రాఫిక్ విభాగంలో పనిచేసే వాసుదేవ రెడ్డిని తీసుకొచ్చారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ను చేశారు. రెవెన్యూ ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న సత్యప్రసాద్ను తీసుకువచ్చి కీలక బాధ్యతలు కట్టబెట్టారు. ఆ ఇద్దరూ అధికారులతో ఒక చైన్ సిస్టం ఏర్పాటు చేసి.. మద్యంలో అడ్డగోలుగా దోపిడీ చేశారు.
* ఇక మరింత లోతుగా..
అయితే తమ చేతికి మట్టి అంటకుండా.. బాగానే మేనేజ్ చేశారు అప్పటి ప్రభుత్వ పెద్దలు. అయితే మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన ఆదాయం లో అంతిమ లబ్ధిదారుడు ప్రభుత్వ పెద్దగా ఉండగా.. అప్పట్లో ఉన్న ప్రభుత్వ పెద్దలందరికీ ఈ కుంభకోణంలో భాగం ఉంది. ఇదే విషయాన్ని స్వయంగా విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy) ప్రకటించిన సందర్భం కూడా ఉంది. ఒక కేసు విచారణకు హాజరై మద్యం కుంభకోణంలో జరిగిన పరిణామాలపై క్లూ ఇచ్చారు విజయసాయిరెడ్డి. ఆయన మాట్లాడిన తర్వాతే మద్యం కుంభకోణంలో సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి అరెస్టు జరిగింది. అటు తరువాత సీఎంఓ అధికారులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, జగన్ ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సన్నిహితుడు బాలాజీ గోవిందప్ప, కొంతకాలానికి ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఇలా ప్రముఖులంతా అరెస్టయ్యారు. ఒక్క విజయసాయిరెడ్డి అరెస్టు మాత్రం జరగలేదు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి సాక్షిగా వచ్చి వివరాలు ఇచ్చినప్పుడే ఈ కేసులో కొంత పురోగతి సాధించారు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు. ఇప్పుడు కుంభకోణాన్ని ప్రత్యక్షంగా నడిపిన వాసుదేవ రెడ్డి, సత్య ప్రసాద్ లు అప్రూవర్లు గా మారడంతో ఈ కేసు మరింత బిగుసుకోనుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ కేసులో ఇది సంచలనమే.