Senior Leader joining YSRCP: వచ్చే ఎన్నికలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యలాంటివి. ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిన ఎన్నికలు అవి. లేకుంటే పార్టీకి గడ్డు పరిస్థితులు తప్పవు. అందుకే సర్వశక్తులు ఒడ్డుతోంది ఆ పార్టీ. గెలుపు గుర్రాలను వెతికే పనిలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి. గెలిచే ఛాన్స్ ఉన్నవారికి టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకే వివిధ కారణాలతో పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన వారికి తిరిగి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ నేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే ప్రకాశం జిల్లా రాజకీయాలు ఒక మలుపు తిరిగినట్టే. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు వైసీపీలోకి వచ్చేందుకు అనుమతి లభించినట్లు ప్రచారం నడుస్తోంది. అందుకే ఆయన చీరాల నియోజకవర్గంలో పర్యటనలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
జిల్లా రాజకీయాల్లో మంచి స్థానం..
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆమంచి కృష్ణమోహన్ ది ప్రత్యేక స్థానం. ఒక సాధారణ జడ్పిటిసిగా ఉన్న ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. మరోసారి ఇండిపెండెంట్గా పోటీ చేసి ప్రధాన పార్టీ అభ్యర్థులకు ఓడించి మరి ఎమ్మెల్యే అయ్యారు. ప్రధానంగా చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ కు పట్టు ఎక్కువ. బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆయన జడ్పిటిసిగా తన ప్రస్తానాన్ని ప్రారంభించారు. రోశయ్య ప్రోత్సాహంతో రాజకీయాల్లో రాణించగలిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి.. వైసీపీ నుంచి టీడీపీలోకి.. అక్కడ నుంచి కాంగ్రెస్లో చేరారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించారు. షర్మిల పక్కన కనిపించే ఆమంచి కృష్ణమోహన్ ఇటీవల కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరమయ్యారు. తన అనుచరులతో తరచూ చేరాలని నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు.
టిడిపిలో చేరికకు ప్రయత్నం..
ప్రస్తుతం చీరాల నియోజకవర్గ ఇన్చార్జిగా కరణం బలరాం కుమారుడు వెంకటేష్ ఉన్నారు. అయితే వారు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. చీరాల నియోజకవర్గంలో తనకంటూ పట్టు నిలుపుకుంటూ వచ్చారు ఆమంచి కృష్ణమోహన్. 2009లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన ఆయన తెలుగుదేశం పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. 2019 ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే చంద్రబాబు అనూహ్యంగా కరణం బలరామును చీరాల అభ్యర్థిగా ప్రకటించారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జగన్ ప్రభంజనం వీచింది. చీరాలలో మాత్రం టిడిపి అభ్యర్థి కరణం బలరాం గెలిచారు. గెలిచిన కొద్ది రోజులకే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అప్పటినుంచి కరణం బలరాం వర్సెస్ ఆమంచి కృష్ణమోహన్ అన్నట్టు పరిస్థితి మారింది. ఈ క్రమంలో ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
మారిన జగన్ ఆలోచన..
అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కరణం బలరాం చూపు మాతృ పార్టీ వైపు ఉందన్న ప్రచారం ఉంది. అదే జరిగితే చీరాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తప్పేలా లేదు. అందుకే అక్కడ పట్టున్న ఆమంచి కృష్ణమోహన్ ను పార్టీలోకి రప్పించి టికెట్ ఇవ్వాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారు. అందుకే పార్టీకి దూరంగా ఉంటున్నారు ఆమంచి. త్వరలో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..