Ayyannapatrudu Chintakayala: తెలుగుదేశం పార్టీతో( Telugu Desam Party) రాజకీయ జీవితం ప్రారంభించిన చాలామంది నేతలు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది కొనసాగుతూ వచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం చాలా మంది క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. వారసులను రంగంలోకి దించారు తెలుగుదేశం పార్టీ నుంచి. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న నేతల్లో ఒక్క అయ్యన్నపాత్రుడు మాత్రమే ఇప్పుడు మిగిలారు. ప్రస్తుతం ఆయన స్పీకర్ గా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాలకు దూరం కావాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. విద్యార్థులతో అసెంబ్లీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన రాజకీయ జీవితం గురించి మాట్లాడిన అయ్యన్నపాత్రుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చి చెప్పారు. అయితే వారసుడు విజయ్ పోటీ చేసేందుకు గాను ఈయన పక్కకు తప్పుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
* సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా..
తెలుగుదేశం పార్టీలో అయ్యన్నపాత్రుడు( Ayyanna patrudu) చేయని పదవి అంటూ లేదు. 1983లో టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతూ వచ్చారు అయ్యన్నపాత్రుడు. పార్టీ పట్ల వీర విధేయత ప్రదర్శించే నేతల్లో అయ్యన్న ఒకరు. 1983, 1985, 1989, 1994, 1999, 2004, 2014, 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1996 సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచి టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయన మంత్రి పదవి చేపడుతూ వచ్చారు. అయితే ఈసారి మాత్రం చంద్రబాబు ఆయన పెద్దరికాన్ని గౌరవిస్తూ స్పీకర్ పదవి ఇచ్చారు.
* ఈసారి కుమారుడు పోటీ..
రాజకీయాల్లో అన్ని రకాల పదవులు అనుభవించారు అయ్యన్నపాత్రుడు. ఇక చాలు అన్న సంతృప్తితో ఉన్నారు. వాస్తవానికి ఆయన కుమారుడు విజయ్( Vijay) 2024 ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉండేది. అయితే అప్పటి రాజకీయాలకు అనుగుణంగా చంద్రబాబు ఈసారి అయ్యన్నపాత్రుడును రంగంలోకి దించారు. అయితే తండ్రికి తగ్గ తనయుడిగా కుమారుడు విజయ్ తనదైన శైలిలో రాజకీయాలు నడుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు సేవలందిస్తూ వచ్చారు. 2024 లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అన్న నిబంధన విధించడంతో వెనక్కి తగ్గారు. అయితే ఈసారి క్రియాశీలక రాజకీయాల నుంచి అయ్యన్నపాత్రుడు దూరం కానున్నారు. ఆయన కుమారుడు పోటీ చేయడం పక్కా అని కూడా తేలిపోయింది.