Nara Lokesh: మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh) పార్టీ పూర్తిగా దృష్టిపెట్టారు. 135 మంది టీడీపీ ఎమ్మెల్యేల పనితీరును మదిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇంతే సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలవాలని లోకేష్ భావిస్తున్నట్టు ఉన్నారు. అందుకే ఈ ఎమ్మెల్యేలు ఎవరెవరు వెనుకబడి ఉన్నారు? పార్టీ ఆదేశాలు పాటించడం లేదు? అనే విషయాలను నిఘా వర్గాల నుంచి సేకరిస్తున్నారు. ఈ క్రమంలో ఓ 45 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని గుర్తించారు. అందులో ఓ 23 మంది ఎమ్మెల్యేల నుంచి సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఎందుకంటే టిడిపిలో క్రమశిక్షణ చేయి దాటుతోందన్న విమర్శ ఉంది. అందుకే ఇప్పుడు నారా లోకేష్ పూర్తిగా దృష్టిపెట్టారు. అవసరం అనుకుంటే కఠిన చర్యలకు ఉపక్రమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు టిడిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
* ఆది నుంచి చంద్రబాబు హెచ్చరిక..
కూటమి వచ్చిన తొలినాళ్ల నుంచి సీఎం చంద్రబాబు( CM Chandrababu) హెచ్చరిస్తూనే ఉన్నారు. ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకోవాలని.. ప్రజలు ఎంతో నమ్మకంతో ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదని పార్టీ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. అయినా సరే కొంతమంది ఎమ్మెల్యేల ప్రవర్తన మారలేదు. చెప్పి చెప్పి విసిగిపోయిన చంద్రబాబు ఇప్పుడు యాక్షన్ లోకి దిగారు. ఆ బాధ్యతలను లోకేష్ కు అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన లోకేష్ ఇటీవల పార్టీ ఆదేశించిన కార్యక్రమాలు చేయని ఎమ్మెల్యేలను గుర్తించే పనిలో పడ్డారు. గత నెలలో పింఛన్ల పంపిణీ, రైతుల కోసం కార్యక్రమంలో పాల్గొనని 45 మంది ఎమ్మెల్యేల వివరాలను తెలుసుకున్నారు. ఇందులో గత మూడు నెలలుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని ఓ 23 మంది ఎమ్మెల్యేల వివరాలను కూడా తెలుసుకున్నారు. వారిని ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడనున్నారు లోకేష్. మారుతారా మార్చేయమంటారా అని హెచ్చరించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
* జగన్ మాదిరిగా ఇబ్బందులు ఉండకూడదని..
గతంలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఇబ్బందులు వచ్చాయి. అప్పట్లో ఆయన కూడా తరచూ వర్క్ షాపులు నిర్వహించేవారు. పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసేవారు. మారుస్తారా మార్చేయమంటారని హెచ్చరించేవారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు లోకేష్. పనిచేయని ఎమ్మెల్యేలను గుర్తించి ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అక్కడ ప్రోత్సహించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చేయని పనిని.. ఇప్పుడు లోకేష్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేయనుండడంతో ఇప్పటికే కూటమిలో బహు నాయకత్వం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు తప్పు చేస్తే అక్కడికక్కడే కఠిన చర్యలు తీసుకోవడం ఉత్తమమని లోకేష్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రయత్నం కూడా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.