Arudra : ఉన్న ఊరు.. కన్న తల్లితో సమానమంటారు. ఉన్న ఊరిని వదిలిపెట్టి వెళ్లేందుకు ఎవరూ అంతగా ఇష్టపడరు. ఆమె కూడా తన సొంత ఊరుతో అంతే అనుబంధాన్ని కలిగి ఉంది. కానీ అప్పటి అధికార వైసీపీ నాయకులు ఆమెను ఇబ్బంది పెట్టారు.. తీవ్రంగా వేధించారు. చివరికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లినా ఆమె సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఉన్న ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. సొంత రాష్ట్రాన్ని కాదనుకుంది. ఏకంగా ఉత్తర ప్రదేశ్ వెళ్లి.. వారణాసిలో ఉంటోంది. ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడంతో ఆమె ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. మంచం పట్టిన తన బిడ్డను చూసుకుంటూ కన్నీటి పర్యంతమవుతోంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తానని చెబుతోంది. ఇంతకీ ఆమె దీన గాధ ఏంటంటే..
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెం గ్రామంలో ఆరుద్ర అనే మహిళ తన కుటుంబంతో జీవిస్తోంది. ఈమెకు వెన్నెముక సమస్యతో మంచం పట్టిన ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు సాయి లక్ష్మి చంద్ర. ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు రాయుడుపాలెంలో ఉన్న తన సొంత ఇంటిని అమ్మేందుకు ప్రయత్నించింది. దీనిని నాటి మంత్రి దాడిశెట్టి రాజా దగ్గర పనిచేసేవారు అడ్డుకున్నారట. ఇల్లును అమ్మకుండా చూశారట. పైగా ఆమెపై వేధింపులకు పాల్పడ్డారట. ఈ విషయాన్ని చెప్పుకునేందుకు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఆమె ప్రయత్నించింది. అక్కడ కూడా ఆమెకు తిరస్కరణ ఎదురైంది. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించింది. అయినప్పటికీ అధికార పార్టీ నాయకులు వేధింపులు మానలేదు. దీంతో ఆమె తన కుటుంబంతో రాష్ట్రం వదిలి వెళ్ళిపోయింది. మంచం పట్టిన తన కుమార్తెతో కలిసి వారణాసిలో ఉంటున్నది.
ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసిపి అధికారాన్ని కోల్పోవడంతో ఆరుద్ర సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. ” ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు. ఎన్నికల్లో కూటమి నాయకులు విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. గత ప్రభుత్వం నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. దాడిశెట్టి రాజా అనుచరులు వేధింపులకు పాల్పడ్డారు. దీంతో నా కుటుంబంతో కలిసి నేను వారణాసి దాకా వచ్చాను.. ఇప్పుడు ఏపీలో వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. నేను త్వరలో నా సొంత రాష్ట్రానికి వస్తాను. నాకు మద్దతు ఇచ్చిన వారంతా చంద్రబాబుకు ఓటు వేశారు. వారందరికీ ధన్యవాదాలు. త్వరలో సొంత రాష్ట్రానికి వచ్చి నాకు జరిగిన అన్యాయాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కు చెప్తాను. వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏ ఆడపిల్లకూ అన్యాయం జరగదని” ఆరుద్ర ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన దాడిశెట్టి రాజా ఓటమిపాలయ్యారు.