https://oktelugu.com/

Nominated Posts : 23న నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా.. పదవులు దక్కేది వారికేనా?

సాధారణంగా నామినేటెడ్ పోస్టులపై ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆశలు పెట్టుకుంటుంది. అయితే ఈసారి పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన వారు నామినేటెడ్ పోస్టుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే మూడు పార్టీలకు పదవులు పంచాల్సి రావడంతో చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేయాల్సి వస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : October 18, 2024 / 11:25 AM IST

    Nominated posts

    Follow us on

    Nominated Posts :  ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. చాలామంది ఆశావహులకు అవకాశం దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈసారి అటువంటి పరిస్థితి తలెత్తకుండా సీఎం చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నామినేటెడ్ పోస్టుల కూర్పు జరుగుతున్నట్లు సమాచారం. అన్ని జరిగితే 23 నాటికి నామినేటెడ్ పోస్టుల జాబితాను ప్రకటిస్తారని తెలుస్తోంది. అందులో ప్రతిష్టాత్మకమైన టిటిడి చైర్మన్ పోస్ట్ కూడా ఉంది. దీంతో ఆశావహుల్లో ఒక రకమైన టెన్షన్ కనిపిస్తోంది. తొలి విడతలో భాగంగా 2 నామినేటెడ్ పోస్టులను ప్రకటించిన సంగతి తెలిసిందే. 20 కార్పొరేషన్లకు సంబంధించి అధ్యక్షులతో పాటు 99 మందికి వివిధ హోదాల్లో నియామకాలు చేశారు. చైర్మన్ పోస్టులకు సంబంధించి టిడిపి నుంచి 16 మంది, జనసేన నుంచి ముగ్గురు, బిజెపి నుంచి ఒకరికి పదవులు దక్కాయి. టిడిపి నుంచి సీనియర్ నేతలు కొనకల్ల నారాయణ, పీతల సుజాత, దీపక్ రెడ్డి, రవి నాయుడు లకు పదవులు వరించాయి. కానీ టిడిపి వాయిస్ ను బలంగా వినిపిస్తున్న మాజీ మంత్రులు దేవినేని ఉమా, కె.ఎస్ జవహర్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జీవీ రెడ్డి లాంటి వారికి చోటు దక్కలేదు. దీంతో వారిలో ఒక రకమైన అసంతృప్తి బయటపడింది.

    * జాగ్రత్తలు తీసుకుంటున్న చంద్రబాబు
    అందుకే ఈసారి చంద్రబాబు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూడు పార్టీల్లో విధేయులకు పెద్దపీట వేయనున్నారు. తొలి జాబితాలో జనసేన, బిజెపికి తగిన ప్రాధాన్యం దక్కలేదు. దీంతో ఆ రెండు పార్టీల నుంచి అసంతృప్తి వ్యక్తం అయింది. మరోసారి ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ, జనసేన నాయకత్వాల నుంచి అభిప్రాయాలను సేకరించారు. వారిచ్చిన జాబితాలను క్రోడీకరించి.. సరైన పదవులు వారికి ఇస్తారని తెలుస్తోంది. ప్రధానంగా బిజెపిలో చాలామంది అసంతృప్తితో ఉన్నారు. తమకు గుర్తింపు ఇవ్వడం లేదని హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో బీజేపీ అగ్ర నేతలు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం.

    * సీనియర్ల ఎదురుచూపులు
    ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా చాలామంది సీనియర్లు టికెట్లు త్యాగం చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, ఆలపాటి రాజా, పిఠాపురం వర్మ.. ఇలా పొత్తులో భాగంగా తెలుగుదేశం వదులుకున్న 31 అసెంబ్లీ సీట్లలో తెలుగుదేశం పార్టీ నేతలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఈసారి కచ్చితంగా వారి పేర్లు రెండో జాబితాలో ఉంటాయని ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.