Scrub Typhus Alert: ఏపీని ఒక పురుగు వణికిస్తోంది. ప్రాణాలను తోడేస్తోంది. మరణాలు సైతం సంభవిస్తుండడంతో సర్వత్ర ఆందోళన నెలకొంది. విజయనగరం జిల్లాలో ఓ మహిళ ఈ వైరస్ తో మృతి చెందడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. వ్యాధి తీవ్రత, వ్యాప్తి, నివారణ వంటి వాటిపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లో సైతం పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అన్ని జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేసింది ప్రభుత్వం. అయితే స్క్రబ్ టైఫస్( scrub typhus ) బారిన పడిన వారికి సాధారణ యాంటీబయాటిక్స్ తో వ్యాధి నయమయ్యే అవకాశం ఉంది. కానీ అవగాహన లేకపోవడం.. సకాలంలో గుర్తించకపోవడంతోనే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. స్క్రబ్ టైఫస్ అనేది నల్లిని పోలిన చిన్న కీటకం. ఇది కుడితే శరీరం పై నల్లని మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి. వ్యాధి లక్షణం కూడా ఇదే. ఓ వారం రోజుల తర్వాత జ్వరంతో పాటు వణుకు, తలనొప్పి, కండరాల నొప్పులు, జీర్ణ సమస్యల రూపంలో ఇన్ఫెక్షన్ బయటపడుతుంది. సకాలంలో గుర్తించగలిగితే ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలతో పాటు ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి.
* అయితే చూసేందుకు స్క్రబ్ టైఫస్ అనేది చిన్న కీటకం. కానీ అది కుడితే మాత్రం తీవ్ర మూల్యం తప్పదు. ఈ కీటకం ఎక్కువగా ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్య సంచరిస్తూ ఉంటుంది. అయితే ఇది కుడితే మాత్రం వైరస్ సోకుతుంది. మనిషి నుంచి మనిషికి ఇన్ఫెక్షన్ సోకదు. కీటకం కాటుకు గురైన వ్యక్తి అస్వస్థతకు గురవుతారు. వెంటనే ఆసుపత్రిలో చేర్చితే ఫలితం ఉంటుంది. యాంటీబయాటిక్స్ ప్రయోగించి ఇన్ఫెక్షన్లతో పాటు వ్యాధిని నియంత్రించవచ్చు.
* సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంటుంది. పొలాలతో పాటు తోటల్లో ఈ పురుగు సంచారం అధికం. పశువుల శాలలతో పాటు వ్యర్ధాలు పోగు చేసే ప్రాంతాల్లో పనిచేసే వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి.
* ఇళ్లతో పాటు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. పాత మంచాలు, పరుపులతోపాటు దిండ్లలో ఈ కీటకాలు చొరబడే అవకాశం ఉంటుంది.
* పిల్లలపై ప్రభావం ఉంటుంది కాబట్టి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆరుబయట ఆడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.