Saraswati Power Company Lands :  ‘సరస్వతి’ భూముల లీజు రద్దు.. వైఎస్ కుటుంబానికి కూటమి షాక్!

ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదం. అయితే అది వైఎస్ఆర్ సంపాదించిన ఆస్తి కాదు. సరస్వతీ పవర్ కంపెనీ పేరిట పొందిన భూములది. అందుకే ఈ విషయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : October 25, 2024 2:20 pm

Saraswati Power Company Lands

Follow us on

Saraswati Power Company Lands : వైయస్ కుటుంబంలో ఆస్తి వివాదాలు తెరపైకి వచ్చాయి.తన కంపెనీలు షేర్లను తల్లికి రాసిస్తే.. ఆమె నిబంధనలను ఉల్లంఘించి తన చెల్లెలి పేరిట వాటాలు రాశారని ఆరోపిస్తూ ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గత రెండు రోజులుగా ఈ అంశం ఏపీలో వివాదంగా మారింది.అయితే వివాదానికి కారణమైన సరస్వతి కంపెనీ భూముల లీజును రద్దు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అది వైయస్సార్ కుటుంబ వాటాగా వారు పరిగణిస్తుంటే.. అయితే అది ప్రజల నుంచి కారు చౌకగా కొట్టేసిన భూమిగా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వాటిని లీజులను రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పల్నాడు జిల్లా గురజాల లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు నిర్ణయించింది.సరస్వతి పవర్ కంపెనీకి అనుమతి ఇచ్చింది.అప్పట్లో జగన్ రైతుల నుంచి కారు చౌకగా వందల ఎకరాలు కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 2009లో రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు. 2009 మే 18న సరస్వతీ పవర్ సంస్థకు దాచేపల్లి, మాచవరం మండలాల పరిధిలో 1515.93 ఎకరాల్లో అత్యంత విలువైన సున్నపురాయి నిక్షేపాలను ప్రభుత్వం కట్టబెట్టింది. అయితే అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పి పేద రైతుల నుంచి భూములు సహకరించారు. కానీ అక్కడ ఒక్క ఇటుక కూడా చేర్చలేదు.ఇప్పుడు అదే భూమిలో షేర్ల కోసం కుటుంబంలో వివాదాలు వచ్చాయి. అందుకే ప్రభుత్వం ఈ భూముల లీజును రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

* అది విద్యుత్ ఉత్పత్తి సంస్థ
వాస్తవానికి సరస్వతీ పవర్ అనేది విద్యుత్ ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన కంపెనీ. కానీ భారతీ సిమెంట్ లో అడ్డగోలుగా లబ్ది పొందారు జగన్. అందుకే సరస్వతి పవను సైతం సిమెంట్ కంపెనీగా మార్చేశారు. 2008 ఆగస్టు 18న జగన్ అధ్యక్షతన కంపెనీ సర్వసభ్య సమావేశం జరిగింది. అప్పుడే పవర్ సంస్థ కాస్త సిమెంట్ పరిశ్రమగా మారిపోయింది.అయితే ఈ సంస్థ సిమెంట్ రంగంలోకి అడుగు పెట్టక ముందే..గనులు లీజుకు ఇవ్వడం విశేషం. ఇదే కంపెనీలో షేర్ హోల్డర్స్ గా ఉన్నారు వైయస్ విజయమ్మ, షర్మిల. అయితే తనకు చెందిన షేర్లను విజయమ్మ కుమార్తె షర్మిల పేరిట బదలాయించడానికి జగన్ జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

* పరిశ్రమ లేదు కానీ..
అసలు పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. ఉత్పత్తి ప్రారంభించలేదు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత సరస్వతీ పవర్ కు గనుల లీజు పునరుద్ధరించడంతో పాటు లీజు కాల పరిమితిని 50 ఏళ్లకు పెంచారు. అటు తర్వాత కూడా ఎటువంటి కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఇప్పుడు దానినే కుటుంబ ఆస్తిగా భావిస్తున్నారు జగన్. అందుకే ఆ భూముల లీజును రద్దు చేయాలని డిమాండ్ వస్తోంది. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.