Sankranti Special Trains 2026: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ప్రారంభం అయ్యింది. స్వగ్రామాలను వెతుక్కుంటూ వలస జీవులు వస్తున్నారు. అయితే ఎటు చూసినా జన రద్దీ కనిపిస్తోంది. పల్లెలు, పట్టణాలు కళకళలాడుతున్నాయి. బస్సులతో పాటు రైలు రద్దీగా మారాయి. సంక్రాంతి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల కోసం 12 జన సాధారణ్ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. విజయవాడ- విశాఖపట్నం మార్గంలో ఇది సేవలందిస్తాయి. జనవరి 15 మినహా.. 18 వరకు ఈ రైళ్లు అందుబాటులోకి ఉంటాయి. ఉదయం 10 గంటలకు విశాఖలో బయలుదేరే రైలు విజయవాడకు సాయంత్రం నాలుగు గంటలకు చేరుకుంటుంది. సాయంత్రం 6:30 గంటలకు విజయవాడలో బయలుదేరి రాత్రి 12:30 గంటలకు విశాఖ చేరుతుంది. ఇలా 18వ తేదీ వరకు 12 రైళ్లు ఇలా తిరగనున్నాయి.
* ప్రముఖ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి. దువ్వాడ రైల్వే స్టేషన్, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం రైల్వే స్టేషన్ల మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
* వీటికి ఎటువంటి ముందస్తు రిజర్వేషన్ అవసరంలేదు. పండగ రద్దీ దృష్ట్యా జనాల రాకపోకలు సాగించే వీలుగా దక్షిణ మధ్య రైల్వే వీటిని ఏర్పాటు చేసింది.
* ఇప్పటికే చర్లపల్లి – కాకినాడ.. చర్లపల్లి- మచిలీపట్నం.. హైదరాబాద్- విశాఖ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. వీటికి అదనంగా జన సాధారణ్ పేరిట ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.