Sand Mafia Controversy: కృష్ణా నది( Krishna river) పరివాహక ప్రాంతాల్లో ఇసుక దందా ఆగడం లేదు. ఇప్పటికీ ఇసుక తరలిపోతూనే ఉంది. అయితే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న.. ఇసుక అక్రమ రవాణా చేసేది మాత్రం కొంతమందే. గత ఐదేళ్లలో అక్రమ వ్యాపారంతో కృష్ణానదిని గుల్ల చేసిన వారే ఇప్పుడు అదే పని కొనసాగిస్తున్నారు. మొన్నటి వరకు వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇసుక దందా సాగించారు. ఇప్పుడు వారే తెర వెనుక చక్రం తిప్పుతున్నారు. ఎక్కడైనా అధికారుల తనిఖీల్లో పట్టుబడితే.. అధికారపక్ష నేతలతో సిఫార్సు చేయించుకుని బయటపడుతున్నారు. ముఖ్యంగా అమరావతి మండలం దిడుగు, తుళ్లూరు మండలం రాయపూడి, బోరుపాలెం ఇసుక రీచ్ ల నుంచి భారీగా ఇసుక తరలిపోతోంది. తాడేపల్లి, కొల్లిపర, కొల్లూరు మండలాల్లో కూలీలతో ట్రాక్టర్లలో నింపించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా మంత్రి నాదెండ్ల మనోహర్ బినామీ అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం నడుస్తోంది.
కొల్లిపర నుంచి ఇసుక తరలింపు..
కొల్లిపర ( kollipara ) మండలం మున్నంగి ఇసుక రీచ్ లో వైసీపీ హయాంలో ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవడానికి స్థానికులు ప్రయత్నించారు. అప్పట్లో వివాదం కూడా నడిచింది. అయితే అప్పట్లో ఆరోపణలు ఉన్న నేత ఇప్పుడు ఆ దందాను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వారంతా మంత్రి నాదెండ్ల మనోహర్ కు బినామీ అని సోషల్ మీడియా వేదికగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు నాదెండ్ల మనోహర్. కానీ తెనాలి నియోజకవర్గంలో ఇసుక అక్రమ దందాకు మాత్రం చెక్ పడడం లేదు. ఈ విషయంలో లారీ నంబర్లతో సహా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడం విశేషం. అయితే ఇదంతా రాజకీయ కుట్రగా కూటమి పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
Also Read: టీడీపీ పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు..
సోషల్ మీడియాలో ఫోటోలతో పోస్టులు
ఇటీవల కొల్లిపరలో గ్రామ నడిబొడ్డున ఉన్న సరిహద్దు రాయిని ఓ లారీ ఢీకొంది. అయితే అది ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీ ఢీకొట్టడం వల్లే జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. AP 16th 7684 నంబరు గల లారీ అని.. అది నాదేండ్ల మనోహర్( Manohar ) బినామీ వ్యక్తి పేరు మీద నడిపిస్తున్న వాహనం అని సోషల్ మీడియా వేదికగా ప్రచారం నడుస్తోంది. ఇసుక అక్రమ రవాణా వెనుక నాదేండ్ల మనోహర్ పాత్ర ఉందంటూ లోకల్ మీడియా పతాక శీర్షికన ఫోటోలతో కథనం రాసింది. అదే కథనంతో పాటు సదరు నెంబర్ ప్లేట్ తో ఉన్న లారీ.. కొల్లిపరలో ధ్వంసమైన పురాతన రాయి ఫోటోలను జతచేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే దీనిని కూటమి పార్టీలు తప్పు పడుతున్నాయి. పారదర్శకంగా ఇసుక సరఫరా జరుగుతుంటే తట్టుకోలేక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారానికి దిగుతోందని మండిపడుతున్నాయి. కూటమి ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఈ ప్రయత్నం అంటూ అభివర్ణిస్తున్నాయి. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.