https://oktelugu.com/

Sana Satish: రాజ్యసభకు సానా సతీష్.. ఎవరీయన? టిడిపి అనుకూల మీడియా వ్యతిరేకత ఎందుకు?*

ఆ మధ్యన ఆంధ్రజ్యోతిలో పవర్ బ్రోకర్ అంటూ ఒక కథనం వచ్చింది. సానా సతీష్ అనే వ్యక్తిని ఉద్దేశించి రాసిన కథనం అది.ఇప్పుడు అదే సానా సతీష్ ను రాజ్యసభ పదవికి ఎంపిక చేశారు అన్న ప్రచారం నడుస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : December 4, 2024 / 10:28 AM IST

    Sana Satish

    Follow us on

    Sana Satish: ఏపీలో రాజ్యసభ పదవుల ఖరారు దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. వైసిపి కి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు రాజీనామా చేశారు. మోపిదేవితో పాటు బీదా మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆర్ కృష్ణయ్య మాత్రం బిజెపికి దగ్గరవుతున్నారు. అయితే ఇప్పుడు ఖాళీ అయిన ఈ మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు స్థానాలు కూటమి ఖాతాలో పడనున్నాయి. తీవ్ర తర్జన భర్జన నడుమ టిడిపికి రెండు, బిజెపికి ఒక స్థానం ఖరారు అయినట్లు తెలుస్తోంది. టిడిపి నుంచి బీదా మస్తాన్ రావుకు మరోసారి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. మరో స్థానాన్ని మాత్రం సానా సతీష్ అనే నేతకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీంతో సతీష్ పై చర్చ నడుస్తోంది. ఇంతకీ ఈయన ఎవరు? ఈయన ప్రస్థానం ఏంటి? టిడిపి అనుకూల మీడియా ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు? అన్న చర్చ ప్రధానంగా నడుస్తోంది. వాస్తవానికి సానా సతీష్ జనసేననుంచి కాకినాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తారని ప్రచారం నడిచింది. కానీ చివరి నిమిషంలో సీన్ మారింది. తరువాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు రాజ్యసభ పదవికి ఆయనను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రజ్యోతి అయితే ఏకంగా పవర్ బ్రోకర్ అంటూ ఆయన గురించి కథనం రాయడం సంచలనం రేకెత్తించింది. వైసిపి హయాంలో చక్రం తిప్పారని.. ఇప్పుడు టిడిపి హయాంలోనూ అదే పని చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

    * సామాన్య విద్యుత్ ఉద్యోగి
    కాకినాడకు చెందిన సానా సతీష్ విద్యుత్తు శాఖలో ఓ సామాన్య ఉద్యోగి. ఉద్యోగిగా ఉంటూ తండ్రి అకాల మరణంతో కారుణ్య నియామకం కింద సతీష్ కు ఉద్యోగం వచ్చింది. టిడిపి తో పాటు వైసీపీ నేతలతో పరిచయాలు ఏర్పడడంతో వ్యాపారం కోసం ఉద్యోగాన్ని విడిచిపెట్టారు సతీష్. హైదరాబాద్ వెళ్లిన సతీష్ నిమ్మగడ్డ ప్రసాద్ కు చెందిన వాన్ పిక్ గ్రూప్ కంపెనీలో తొలినాళ్లలో డైరెక్టర్ గా పని చేసినట్లు తెలుస్తోంది. ఈయన పేరు ఈడీ కేసుల్లో చాలాసార్లు వినిపించింది. హైదరాబాద్ లోని ఎంబీఎస్ జ్యువెలర్స్ కు చెందిన సుఖేష్ గుప్తాకు బెయిల్ సమకూర్చడం కోసం 2017 అక్టోబర్లో సతీష్ బాబు ఢిల్లీ వెళ్లారని.. ఈడి ఓ చార్జ్ షీట్లో పేర్కొంది. నాటి కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ తో పాటు సతీష్ బాబు పై సిబిఐ మరో కేసు నమోదు చేసింది. ఎం ఆర్ స్కాంలో మెయిన్ ఖురేషికి చెల్లింపుల వ్యవహారంలో కోనేరు ప్రసాద్ కుమారుడు ప్రదీప్ ను ఈడి నిందితుడిగా చేర్చింది. నాటి సిబిఐ డైరెక్టర్ ఏపీ సింగ్, ఖురేషి మధ్య మెసేజీల్లో ప్రదీప్ కోనేరు, సతీష్ ప్రస్తావన ఉంది.

    * ఎనలేని ప్రాధాన్యత
    అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సానా సతీష్ ప్రాధాన్యత పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లోకేష్ కోటరిలోకి వెళ్లినట్లు సమాచారం. అందుకే ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సానా సతీష్ పేరు కేవలం ప్రస్తావన మాత్రమే వచ్చిందని.. ఆయన ఎప్పుడూ జైలుకు వెళ్లిన దాఖలాలు లేవని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో నే ఏదో ఒక పార్టీ నుంచి కాకినాడ పార్లమెంటు స్థానంకు పోటీ చేయాలని సతీష్ భావించారు. ఈ ఎన్నికల్లో సైతం అదే తరహా ప్రయత్నాలు చేశారు. కానీ చివరి నిమిషంలో సమీకరణలు మారడంతో ఛాన్స్ దక్కకుండా పోయింది.ఇప్పుడు రాజ్యసభకు ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో టీడీపీ అనుకూల మీడియా ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.