Mahasena Rajesh: కొలికపూడికి.. మహాసేన రాజేష్ కు అదే తేడా

గతంలో మహాసేన రాజేష్ తన దళిత వాదాన్ని వినిపించే క్రమంలో పెద్ద ఉద్యమకారుడుగా మారారు. ఆ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లే క్రమంలో పురుష పదజాలంతో చాలా రకాల మాటలు అనేశారు.

Written By: Dharma, Updated On : March 7, 2024 10:18 am

Mahasena Rajesh

Follow us on

Mahasena Rajesh: తెలుగుదేశం పార్టీలో ఇద్దరు వ్యక్తులకు అనూహ్యంగా టిక్కెట్లు దక్కాయి. ఒకరు టీవీ డిబేట్లో పాల్గొనే కొలికిపూడి శ్రీనివాసరావు, మరొకరు యూట్యూబర్ మహాసేన రాజేష్. దాదాపు ఇద్దరూ దూకుడు కలిగిన నేతలే. ఇద్దరి లక్ష్యము ఒక్కటే. బలమైన వాదాన్ని వినిపించగలరు. ఆవాదంతోనే తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. టిక్కెట్లు దక్కించుకున్నారు. కానీ ఇందులో మహాసేన రాజేష్ కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. గతంలో ఆయన దూకుడుతనం ఇబ్బందిగా మారింది. టిడిపి, జనసేన శ్రేణులతో పాటు హిందుత్వ సంస్థలు ఆయనను వ్యతిరేకించాయి. దీంతో పోటీ నుంచి తప్పుకోవాల్సిన అనివార్య పరిస్థితి మహాసేన రాజేష్ కి ఎదురయింది.

గతంలో మహాసేన రాజేష్ తన దళిత వాదాన్ని వినిపించే క్రమంలో పెద్ద ఉద్యమకారుడుగా మారారు. ఆ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లే క్రమంలో పురుష పదజాలంతో చాలా రకాల మాటలు అనేశారు. దళితుల పట్ల జరిగిన ఘటనల విషయంలో మోతాదుకు మించి మాట్లాడేశారు. ఏ యూట్యూబ్ ఛానల్ ద్వారా సక్సెస్ అయ్యారో.. అదే యూట్యూబ్ ఛానల్ వీడియోలు ఆయన రాజకీయ ఉన్నతికి అడ్డంకిగా మారాయి. అంతకుమించి రాజకీయ అడుగులు వేసే ముందు.. గతంలో తన ద్వారా జరిగిన తప్పిదాలను సరి చేసుకునే ప్రయత్నం మహాసేన రాజేష్ చేయలేదు.సామాజిక మాధ్యమాల ద్వారా రాజేష్ చేపట్టిన ఉద్యమం.. తన ఉన్నతికి అడ్డంకిగా మారడం గమనించాల్సిన విషయం.

మహాసేన రాజేష్ తో పోల్చుకుంటే కొలికపూడి శ్రీనివాసరావు చాలా తెలివైనవాడు. ముందు చూపుతో ఆలోచించగల నేర్పరి. వాస్తవానికి ఆయన వైసీపీ ఫాలోవర్. కానీ అమరావతికి వ్యతిరేకంగా జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తరువాత శ్రీనివాసరావు చాలా వేగంగా ఆలోచించడం ప్రారంభించారు. అమరావతి రైతు ఉద్యమం వైపు అడుగులు వేశారు. ఆ ఉద్యమానికి బలంగా అండగా నిలిచారు. ఏకంగా టీవీ డిబేట్లోనే అమరావతిపై హేళనగా మాట్లాడిన వారి చెంప చెల్లుమనిపించారు. ఇది సహజంగానే రాజకీయ పార్టీలను ఆకర్షిస్తుంది. అదే దూకుడును కనబరిచిన కొలికపూడి ముందుగా టిడిపి శ్రేణుల మనసును ఆకట్టుకున్నారు. వారి నుంచి అభ్యంతరాలు రాకుండా జాగ్రత్త పడ్డారు. అటు అధినేత మనసును గెలుచుకున్నారు. ఇప్పుడు టిక్కెట్ దక్కించుకొని ఎటువంటి అభ్యంతరాలు రాకుండా చూసుకున్నారు. కొలికపూడి వ్యూహం చూస్తే ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్ళింది. కానీ మహాసేన రాజేష్ విషయంలో మాత్రం ఆ వ్యూహం బెడిసి కొట్టింది. కొలికపూడి కంటే మహాసేన రాజేష్ బలమైన ఉద్యమకారుడు అయినా.. దానిని తన సొంతానికి వాడుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. శ్రీనివాసరావు సక్సెస్ అయ్యారు.