Sakshi Media rights: ప్రజాస్వామ్యానికి మీడియా నాలుగో స్తంభం లాగా ఉంటుంది. సమాజంలో జరిగే చీకటి వ్యవహారాలను.. అడ్డగోలు విధానాలను మీడియా బయటపెడుతుంది. రాజకీయ నాయకుల అవినీతిని.. ఇష్టానుసారమైన నిర్ణయాలను మీడియా ఎండ గడుతుంది. అందువల్లే మీడియాకు సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో మీడియా తన లైన్ దాటింది. రాజకీయ రంగులు పూసుకొని కార్యకర్తల కంటే ఎక్కువగా నర్తిస్తోంది. వాస్తవానికి ఇలాంటి పోకడ సమాజానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే మీడియా అనేది నిష్పక్షపాతంగా ఉండాలి. పార్టీకి గొడుగు మోసి.. నాయకులకు దండలు వేసి.. తన కర్తవ్యాన్ని విస్మరిస్తే సమాజం వేరే దారివైపు వెళుతుంది. అంతేకాదు మీడియా తనకున్న విలువను కూడా కోల్పోవాల్సి వస్తుంది.
తెలుగు రాష్ట్రాలలో మీడియా అనేది ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది. గతంలో కొంతమంది వ్యక్తులు తమ విలువలతో మీడియాను నిర్వహించేవారు. మీడియాకు విలువలు ఉండేలా చూసుకునేవారు. కానీ నేటి కాలంలో విలువలు పోయాయి. చివరికి వలువలు కూడా ఊడిపోయాయి. ఫలితంగా మీడియా నగ్నంగా నడి బజార్లో నర్తిస్తోంది. ఎవరు ఎలా ఆడిస్తే అలా ఆడుతోంది. ఇప్పటికైతే ఇలా ఉంది.. తదుపరి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. మీడియా ఇలా మారిపోయిన తర్వాత స్వేచ్ఛ గురించి అడగడం.. నిజంగా హాస్యాస్పదమే అవుతుంది. మీడియాలో ఈ పరిస్థితికి ఎవరు కారణం? మీడియాను నడిపించే వ్యక్తులా? మీడియాలో పనిచేసే వ్యక్తులా? ప్రకటనలు, సర్కులేషన్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్న మీడియా ఆధిపతులు.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఏంటి? విలువల గురించి లెక్చర్లు దంచడం ఏంటి.. అసలు ఆ హక్కులు వారికి ఎవరు ఇచ్చారు?
Also Read: పలాసలో పాతగాయల ప్రతీకారం: అప్పలరాజుపై ‘కళింగ’ సీనియర్ల తిరుగుబాటు!
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో రెండు న్యూస్ చానల్స్ ను తొక్కిపెట్టారు. అందులో ఒక ఛానల్ ఆయనతో కాళ్ల బేరానికి దిగింది. చివరికి ఆయనకు నచ్చినట్టుగా పనిచేయడం మొదలుపెట్టింది. మరో ఛానల్ మాత్రం అలా ఆయనకు తలవంచ లేక పోయింది. పోరాటం చేసింది.. చివరికి విజయం సాధించింది. అలాగని పోరాటం చేసిన మీడియా శుద్ధ పూస కాదు. తలవంచిన మీడియా సర్వపరిత్యాగి అంతకన్నా కాదు. అప్పట్లో ఓ చానల్ ప్రసారాలు తెలంగాణలో నిలిచిపోయినప్పుడు చాలామంది తగిన శాస్తి జరిగిందని అన్నారు. కొంతమంది మీడియా మీద ప్రభుత్వ పెత్తనం ఏంటని మండిపడ్డారు. కాలం గడిచిపోయింది నాడు అధికారంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి మారిపోయారు.
ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది. సహజంగానే జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా సంస్థను అక్కడి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. ప్రసారాలు చేయకుండా అధికారాన్ని ఉపయోగిస్తోంది.. సహజంగానే జగన్ మీడియాకు ఇది ఇబ్బందిగా అనిపిస్తోంది. ఇంకేముంది తనకు అలవాటైన ప్రజాస్వామ్యం, హక్కులు, స్వేచ్ఛ గురించి మాట్లాడుతోంది.. మీడియా పేరుతో వ్యాపారం చేసే వారికి హక్కులు ఎలా ఉంటాయి? వారికి స్వేచ్ఛ ఎలా ఉంటుంది.. వాస్తవానికి హక్కులు ఉండాల్సింది మీడియాలో పనిచేసే వారికి.. మీడియా తప్ప వేరే ఉపాధి లేనివారికి.. అంతేతప్ప మీడియా ద్వారా అడ్డగోలు వ్యవహారాలు చేసే వారికి కాదు. కేవలం ఇది జగన్ అనుకూల మీడియాకు మాత్రమే కాదు.. అన్ని మీడియాలకు వర్తిస్తుంది.
Also Read: జనసేన పార్టీ నుండి వినూత కోట సస్పెండ్
గతంలో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే మీడియాపై వ్యతిరేక ప్రభుత్వాలు తీవ్రంగా ప్రవర్తించాయి. ప్రసారాలను నిలిపివేశాయి. నాటి రోజుల్లో మిగతా మీడియాకు అది ఒక ప్రహసనం లాగా.. పనికిమాలిన వ్యవహారం లాగా అనిపించింది. స్థూలంగా చెప్పొచ్చేది ఏంటంటే మీడియా అనేది డప్పు కొట్టే వ్యవస్థ లాగా.. రాజకీయ నాయకులకు గొడుగు లాగా మారిపోయిన తర్వాత స్వేచ్ఛ గురించి మాట్లాడొద్దు. విలువల గురించి అస్సలు మాట్లాడొద్దు.