Sakshi Media: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి వరమా? శాపమా అన్నది అర్థం కావడం లేదు. సాక్షి మీడియా పార్టీ లైన్ కంటే.. జగన్మోహన్ రెడ్డి లైన్ కి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. కేవలం జగన్ ప్రయోజనాలే తప్ప పార్టీ ప్రయోజనాలకు ఎంత మాత్రం చోటు లేదు అని సొంత పార్టీ వారే చెబుతున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ కష్టకాలంలో ఉంది. అధికార కూటమి నుంచి తీవ్రమైన దాడి జరుగుతోంది. ఈ సమయంలో సాక్షి అనేది సమర్థవంతమైన రక్షణ కవచంగా ఉండాలి. కానీ సాక్షి ఎడిటోరియల్ టీం తీసుకుంటున్న అయోమయ నిర్ణయాలు పార్టీకి మైనస్ చేస్తున్నాయి అన్నది ఆ పార్టీ కార్యకర్తల ఆవేదన. క్షేత్రస్థాయిలో పోరాడుతుంటే.. మీడియా కవరేజ్ లేక కష్టమంతా వృధా అవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
* మావిగన్ పై..
జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే ప్రతిపాదన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తొలుత మూడు రాజధానులను లైన్ గా తీసుకున్న పార్టీ.. ఇటీవల మాట మార్చింది. మచిలీపట్నం- విజయవాడ- గుంటూరును కలుపుతూ మావిగన్ ప్రతిపాదన చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ప్రకటనలు చేసినప్పుడు కొన్ని రకాల కథనాలు ప్రచురించడం అనేది వారికి అలవాటు. కానీ సాక్షి మీడియాలో మావిగన్ అనుకూల కథనాలు ఏవి రాలేదు. కనీసం వాటికి ప్రాధాన్యం కూడా దక్కలేదు.
* మాజీ మంత్రికి దక్కని మద్దతు.
ఇటీవల మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు బైక్ ప్రమాదంలో ఒకరి మరణానికి కారణం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో అప్పలరాజుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అండగా నిలిచాయి. కానీ సాక్షి మీడియాలో మాత్రం ఈ అంశానికి సంబంధించి చోటు దక్కలేదు. దీంతో మాజీ మంత్రి అప్పలరాజు సైతం బాధపడుతున్నారట. పార్టీ కోసం ఎన్నెన్నో మాటలు అన్నానని.. అందుకే టార్గెట్ అయ్యానని అనుచరుల వద్ద బాధపడుతున్నారట. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆయనను పరామర్శించారట. అయితే పార్టీ కోసం సాక్షి పనిచేయడం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తుందన్న విమర్శ ఉంది. సాక్షి మీడియా ప్రస్తుతం ఒక రకమైన గందరగోళంలో ఉంది. సొంత కథనాలకు ప్రాధాన్యం ఇవ్వలేక.. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పలేక నానా అవస్థలు పడుతోంది.


