‘‘నీకేందయ్యా.. జర్నలిస్టువు’’ అంటుంటారు చాలా మంది. అవును మరి, చూడ్డానికి నీట్ గా డ్రెస్ చేసుకుంటాడు. నలుగురితో పరిచయాలు. ఆఫీసర్ల దగ్గర మాట పరపతి. జర్నలిస్టు ‘‘మామూలోడు కాదు’’ అని జనం అనుకోవడానికి ఇంతకన్నా ఏం కావాలి? కానీ.. ఇంటికి వెళ్తే తెలుస్తుంది అసలు పరిస్థితి. ఆ పరిస్థితి తెలిసిన వాళ్లు అంటారు.. ‘‘నీకేముందయ్యా.. జర్నలిస్టువు’’ అని. అతనో ‘‘మామూలోడే కదా’’ అని!
రిపోర్టర్లవి లైన్ అకౌంట్ మీద ఆధారపడే బతుకులైతే.. అత్తెసరు జీతాలతో నడిచే జీవితాలు డెస్క్ జర్నలిస్టులవి. పొద్దంతా తిరిగి సమాజం కోసం వాళ్లు సమాచారం సేకరిస్తే.. నిశాచర జీవితం గడుపుతూ వీళ్లు సిద్ధం చేస్తుంటారు. ఇంత చేస్తున్నా.. ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. ఇంట్లో అవసరాలు తీరవు. అయినప్పటికీ.. సమాజాన్ని మేల్కొలిపేందుకు అక్షర సేద్యం చేస్తున్నానంటూ సర్దిచెప్పుకొని ముందుకు సాగుతుంటాడు జర్నలిస్టు.
కానీ.. కరోనా నేపథ్యంలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అప్పటి వరకూ తిన్నా తినకున్నా.. బయట పడకుండా బండి నడిపించిన జర్నలిస్టుల వాస్తవ దుస్థితి బయటపడడం మొదలైంది. ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేక ఎంతో మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబాలకు కనీస ఆదెరువు చూపించకుండా అర్ధంతరంగా వెళ్లిపోయారు. దీంతో.. చాలా మంది జర్నలిస్టుల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. అయినప్పటికీ.. ప్రధాన స్రవంతిగా కీర్తిపొందుతున్న మీడియా సంస్థలకు.. తమ ఉద్యోగులను ఆదుకునేందుకు చేయి రాలేదన్నది వాస్తవం.
ఈ నేపథ్యంలో ప్రధాన మీడియాలో ఒకటిగా ఉన్న సాక్షి సంస్థ.. తమ సిబ్బంది కోసం అమూల్యమైన నిర్ణయం తీసుకుంది. కరోనాతో చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి ఏడాది కాలం పాటు ప్రతినెలా కొంత మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకొచ్చింది. ఉద్యోగి నెల జీతం 25 వేల కన్నా తక్కువగా ఉంటే.. ఆ వేతనన్నా ప్రతినెలా అందిస్తుంది. ఎక్కువగా ఉంటే.. 25 వేలను అందిస్తుంది. దీంతోపాటు గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ కింద 4 లక్షలు, ఎంప్లాయి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ కింద 7 లక్షలు అందిస్తుంది. ఇది కేవలం జర్నలిస్టులకే కాదు.. ఆ సంస్థల్లో పనిచేసే ప్రతీ ఉద్యోగికీ వర్తిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఖచ్చితంగా పెద్ద సాయమేనని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన మీడియా సంస్థలు కూడా తమ ఉద్యోగులకోసం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది వాస్తవం. ప్రధాన స్రవంతి మీడియాగా ఉన్నవారికి.. ఉద్యోగుల కోసం ఇలాంటి చర్యలు చేపట్టడం పెద్ద విషయమేమీ కాదు. కానీ.. ఉండాల్సింది మనసు మాత్రమే. సహాయం చేయడానికి రావాల్సింది చేతులు మాత్రమే. మరి, ఇన్నాళ్లు తమకు సేవ చేసిన ఉద్యోగుల కోసం ఆయా సంస్థలు సముచిత నిర్ణయం తీసుకోవాలని ఆశిద్దాం.