Jagan fires on Sajjala: ఏదైనా పార్టీలో అంతిమ నిర్ణయం అధినేతది. అధికార పార్టీ అయితే చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించాలి. అందులో పార్టీకి ప్రయోజనం ఉండేలా చూసుకోవాలి. అయితే దురదృష్టవశాత్తు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో విచిత్ర పరిస్థితి ఆ పార్టీకి శాపంగా మారింది. అప్పట్లో ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించేవారు సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ నిర్ణయాలు కూడా ఆయన చెప్పేవారు. ఒక్క మాట సజ్జల చెప్పారంటే అది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే అని ఒక అభిప్రాయం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి సమకాలీకులు ఎంతోమంది ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముందు మారు మాట ఆడలేక పోయేవారు. అతని సమయంలో తన మాటగా చెప్పమని చెప్పేటట్టు సజ్జన మీడియా ముందుకు వచ్చి జగన్ అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టి చెప్పేవారు. అయితే ఇటీవల సజ్జల కనీసం జగన్మోహన్ రెడ్డిని సంప్రదించకుండానే అమరావతిపై ఒక నిర్ణయం ప్రకటించారు. జగన్ అధికారంలోకి వచ్చినా అమరావతి నుంచి పాలన సాగిస్తారని.. అందులో మరో మాటకు తావు లేదని తేల్చి పడేశారు.
పుంజుకుంటున్నామన్న ఆలోచన..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడిప్పుడే ఒక నమ్మకం వస్తోంది. భారీ ఓటమి నుంచి కోలుకొని పుంజుకుంటున్నామని.. ఇటువంటి సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి( sajjala Ramakrishna Reddy ) ప్రకటన డిఫెన్స్ లో పెట్టిందని రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో జగన్ సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రత్యేకంగా పిలిపించుకొని క్లాస్ పీకినట్లు సమాచారం. అసలు అమరావతి తో నీకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. వ్యక్తిగత అభిప్రాయం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. పార్టీ శ్రేణులు వద్దంటున్న పదవులు ఇచ్చానని.. అయినా సరే బాధ్యతగా వ్యవహరించడం లేదని.. పార్టీని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అంటూ జగన్ ప్రశ్నించేసరికి సజ్జల ఒక్కసారిగా షాక్ కు గురైనట్లు తెలుస్తోంది.
మీ తప్పులకు మేం జైలుకెల్లాలా?
సజ్జల రామకృష్ణారెడ్డి పై జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) తీవ్ర పదజాలం వాడినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీని అప్పగిస్తే.. తప్పులన్నీ చేశారని.. అందుకు మేము జైలుకెల్లాల్సి వస్తోందని జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే కేవలం అమరావతిపై మాట్లాడినందుకే జగన్మోహన్ రెడ్డి ఈ తరహాలో క్లాస్ పీకడాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి జీర్ణించుకోలేకపోయారట. అయితే జగన్ పిలిచి మరి క్లాస్ పీకడం వెనుక భారీ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడు రాజధానుల అంశం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీసింది. ఆ అంశాన్ని అలానే విడిచిపెట్టి ముందుకు వెళ్లాలని జగన్ ఒక నిర్ణయంతో ఉన్నారు. ఒకవేళ చంద్రబాబు అనుకున్న సమయానికి అమరావతిని కట్టకపోతే.. దానిని హైలెట్ చేసి ప్రజల్లోకి వెళ్లాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్లాన్. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలతో ఆ ప్లాన్ బెడిసి కొట్టింది. అమరావతి పై ఉన్న ఒకే ఒక్క అవకాశం కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయింది. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి పై జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టినట్లు ప్రచారం నడిచింది. ఒకరిద్దరు నేతలు అయితే బాహటంగానే సజ్జల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. కానీ పార్టీ నుంచి ఒక్కోనేత బయటకు వెళ్లిపోవడం.. తనకంటూ నమ్మకస్తులు లేకపోవడం వంటి కారణాలతో జగన్ సైతం పునరాలోచనలో పడ్డారు. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డికి రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమించారు. అయినా సరే జగన్ నమ్మకాన్ని వమ్ము చేస్తూ సజ్జల వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వైసీపీలో ఉన్నాయి. పైగా పార్టీలో నేతలు అందరూ అరెస్టు అవుతున్నారు కానీ… సజ్జల రామకృష్ణారెడ్డి జోలికి కూటమి రాకపోవడం వెనుక కూడా అనేక రకాల అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే సజ్జల విషయంలో ఎంత మాత్రం భరించేందుకు జగన్ సిద్ధంగా లేరన్న ప్రచారం పతాక స్థాయిలో జరుగుతోంది. మరి ఏం జరగనుందో చూడాలి.