Sajjala Ramakrishna Reddy: సజ్జల భార్గవ్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఆయన అరెస్టు ఖాయమా? విచారణ పేరిట రిమాండ్ కు తరలిస్తారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొందరి అరెస్ట్ కూడా జరిగింది. ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డిని అరెస్టు చేస్తారని ప్రచారం ప్రారంభమైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రిమాండ్ కు తరలించారు. విచారణలో వెల్లడించిన అంశాలు బట్టి వైసిపి ప్రముఖుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇంకోవైపు వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి, అర్జున్ రెడ్డి ఆదేశాలతోనే వైసీపీ కార్యకర్తలు పోస్టులు పెట్టే వారిని రవీందర్ రెడ్డి విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు తనను కులం పేరుతో దూషించారని చెబుతూ కడప జిల్లా పులివెందులకు చెందిన ఒక ఎస్సి వ్యక్తి సజ్జల భార్గవ్ రెడ్డి తో పాటు రవీందర్ రెడ్డి, అర్జున్ రెడ్డిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో ఈ ముగ్గురిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. ఇంకోవైపు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల విచారణకు హాజరుకావాలని సూచిస్తూ పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు.
* పరారీలో భార్గవ్ రెడ్డి
ప్రస్తుతం సజ్జల భార్గవ్ రెడ్డి పరారీలో ఉన్నారు. రేపు విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు అందించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన లేకపోవడంతో భార్గవ్ రెడ్డి తల్లికి నోటీసులు అందజేశారు. ఇంకోవైపు అర్జున్ రెడ్డికి సైతం నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలని సూచించారు. భార్గవ్ రెడ్డిని విచారణకు పిలిచి అరెస్టు చేయాలన్నది పోలీసుల ప్లాన్. కానీ ఆయన పరారీలో ఉండడంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు వెళ్లిపోకుండా ఉండేందుకు కట్టడి చేశారు.
* సోషల్ మీడియా ఇన్ఛార్జిగా
సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో కీలకంగా మారారు. ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి 2022లో వైసిపి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. గత ఐదేళ్లుగా రాజకీయ ప్రత్యర్థులను వెంటాడారు, వేటాడారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. సోషల్ మీడియాలో కార్యకర్తలతో అనుచిత వ్యాఖ్యలు చేయించడంలో ఆయన ముందుండేవారిని పోలీస్ విచారణలో తేలింది. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్టు జరుగుతుందని అంతా భావించారు. అయితే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదవుతున్న దృష్ట్యా.. భార్గవ రెడ్డిని అరెస్టు చేస్తారని ప్రచారం నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.