Sajjala Ramakrishna Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా పార్టీ అధినేత, పార్టీ నేతల మధ్య అనుసంధాన కర్తగా ఆయన ఫెయిల్ అవుతున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఆయన పై తరచూ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీలో సజ్జల అన్నట్టు పరిస్థితి ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త కూడా ఆయన. అయితే జగన్ ఆదేశాలను సరిగ్గా పాటించడం లేదని సజ్జలపై ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మావిగన్ రాజధాని ప్రతిపాదనను పార్టీ శ్రేణులకు తీసుకెళ్లడంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఫెయిల్ అయినట్లు ఒక ప్రచారం బలంగా ఉంది. సాక్షి మీడియాలో సైతం పెద్దగా ప్రాధాన్యం లేదు మావిగన్ పై. ఈ విషయంలో సజ్జల ఆదేశాలు ఉన్నాయన్నది జగన్కు వెళ్లిన సమాచారం. అయితే రాజధానుల అంశం కావడంతో సజ్జల ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది. అయితే ఇది జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డిని మందలించినట్లు ప్రచారం సాగుతోంది.
* జర్నలిస్ట్ నుంచి..
స్వతహాగా సజ్జల రామకృష్ణారెడ్డి ఒక జర్నలిస్ట్. ఈనాడులో చాలా ఏళ్ల పాటు పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంతో అటువైపు అడుగులు వేశారు. కొద్ది రోజులపాటు సాక్షి మీడియా బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఆయనకు భారతీయ రెడ్డితో బంధుత్వం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీతో పాటు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు కట్టబెట్టారు. సజ్జల కుమారుడికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బాధ్యతలను కూడా ఇచ్చారు. అయితే ఐదేళ్ల వైసిపి హయాంలో సజ్జల పార్టీ సీనియర్లకు టార్గెట్ అయ్యారు. మొన్నటి ఓటమికి ఆయనే కారణం అన్నవారు ఉన్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఎంతో నమ్మకంతో సజ్జలకు రాష్ట్ర సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు.
* కోర్ టీం లేక..
సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని పెంచడంలో చాలా కృషి చేశారు. ఆ విషయంలో సందేహించలేము కూడా.. కానీ గతంలో సజ్జల చుట్టూ ఒక కోర్ టీం ఉండేది. జర్నలిస్ట్ రామచంద్ర మూర్తి, ప్రియదర్శిని రామ్ వంటి వారు సజ్జల కోసం పనిచేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పైగా పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది సీనియర్లు పెద్ద ఎత్తున సజ్జలపై ఫిర్యాదులు చేశారు. పైగా విజయసాయిరెడ్డి తో పాటు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడానికి సజ్జల కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే రోజురోజుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సంక్లిష్టత పెరుగుతోంది. దానిని ఎలా అధిగమించాలో కూడా సజ్జలకు తెలియడం లేదు. తాజాగా జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన తెచ్చారు. కానీ అది పార్టీ శ్రేణుల్లోకి తీసుకెళ్లడంలో కొంత వెనుకడుగు వేశారు సజ్జల. సొంత మీడియా సాక్షిలో సైతం మావిగన్ కు పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకంటే తరచూ రాజధానుల స్టాండ్స్ మార్చుకుండడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని సజ్జల భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి సజ్జల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో చూడాలి.
