Homeఆంధ్రప్రదేశ్‌Daggubati Hitesh: టిడిపిలోకి ఎన్టీఆర్ మనవడు!

Daggubati Hitesh: టిడిపిలోకి ఎన్టీఆర్ మనవడు!

Daggubati Hitesh: తెలుగుదేశం పార్టీలోకి మరో యువనేత ఎంట్రీకి రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. నందమూరి తారకరామారావు మనవడు దగ్గుబాటి హితేష్ త్వరలో పార్టీలో చేరుతారని తెలుస్తోంది. ఆయన మాజీ మంత్రులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి ల కుమారుడు. ఆయన పూర్తి పేరు హితేష్ చెంచురాం. గతంలో కుటుంబంలో నెలకొన్న విభేదాలు సమసి పోవడంతో చేరికకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది . ప్రస్తుతం దగ్గుబాటి పురందేశ్వరి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ ఎంపీగా కొనసాగుతున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఉన్నారు. దశాబ్దాలుగా చంద్రబాబుతో ఉన్న విభేదాలు సమసిపోవడంతో హితేష్ టిడిపిలో చేరికకు రంగం సిద్ధం అయింది. ఈ మేరకు చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో హితేష్ సైకిల్ ఎక్కడం ఖాయం అన్నట్లు తెలుస్తోంది.

* పర్చూరు నుంచి సుదీర్ఘంగా..
దగ్గుబాటి వెంకటేశ్వరరావు నందమూరి తారక రామారావు అల్లుడు. సీఎం చంద్రబాబుకు స్వయానా తోడల్లుడు. 1983 నుంచి 2009 వరకు క్రియాశీలక రాజకీయాల్లో నడిచారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1985, 1989, 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. 1991లో మాత్రం ఎంపీగా విజయం సాధించారు. 1996లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయనపై టిడిపి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గెలిచారు. సుదీర్ఘకాలం పరుచురు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం అక్కడ టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఉన్నారు. అయినా సరే హితేష్ టిడిపిలో చేరి రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు.

* త్వరలో ఎంట్రీ..
పురందేశ్వరి సైతం తన భర్త వెంకటేశ్వరరావుతో కలిసి 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. రెండోసారి విశాఖ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే ఆమె తర్వాత బిజెపిలో చేరగా.. ఆమె భర్త వెంకటేశ్వరరావు మాత్రం వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వెంకటేశ్వరరావు వైసీపీలో ఓడిపోయిన తర్వాత సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. వాస్తవానికి చంద్రబాబుతో విభేదించి టిడిపి నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పుడు అదే చంద్రబాబుతో విభేదాలు పూర్తిగా సమసి పోయాయి. పైగా సోదరుడు లోకేష్ తో హితేష్కు మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే లోకేష్ టీమ్ లో చేరేందుకు హితేష్ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చంద్రబాబు నుంచి సైతం గ్రీన్ సిగ్నల్ లభించడంతో త్వరలో హితేష్ టిడిపిలో చేరనున్నారు.

Dahagam Srinivas
Dahagam Srinivashttps://oktelugu.com/
Dahagam Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Politics, Sports, Cinema, General, Business. He covers all kind of All kind of news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version