Sai Krishna Case: రౌడీ షీటర్ గాదె సాయి కృష్ణ కేసులో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. సాయి కృష్ణ విచ్చలవిడిగా ప్రవర్తించేవాడు. కృష్ణలంక.. రాణి తోట ప్రాంతంలో రౌడీయిజం చేసేవాడు. మాదక ద్రవ్యాలు విపరీతంగా స్వీకరించేవాడు. మద్యం పీకల దాకా తాగేవాడు. రోడ్డుమీద స్వైర విహారం చేసేవాడు. కొన్ని సందర్భాలలో ఉన్మాద చర్యలకు పాల్పడేవాడు. బీరు సీసాలను పగలగొట్టి అర్థరాత్రి పూట ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేవాడు.
నవీన్ రెడ్డి కేసులో
నవీన్ రెడ్డి అనే యువకుడి హత్య కేసులో సాయి కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడు బెయిల్ మీద విడుదలయ్యాడు. అనంతరం మరికొన్ని కేసుల్లో కూడా అతడిని అరెస్టు చేయడానికి పోలీసులు ఇంటికి వెళ్లారు. అయితే అతడు అప్పటికే పరారీలో ఉన్నాడు. మార్కాపురం ప్రాంతంలో తల దాచుకుంటున్నాడు. నాన్ బెయిలబుల్ వారెంట్ కేసులను పరిష్కరించడానికి పోలీసులు అనేకమంది పాత ఖైదీల గృహాలకు వెళ్లడం మొదలుపెట్టారు. ఇందులో సాయి కృష్ణ కూడా ఉన్నాడు. సాయి క్రిష్ణ ఇంటికి వెళ్తే అక్కడ అతడి తల్లి ఉంది. అతడి తల్లిని అడిగితే.. మొదట్లో వివరాలు చెప్పలేదు. ఆ తర్వాత సాయి కృష్ణ గురించి సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు మార్కాపురం వెళ్లారు. సాయి కృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు.
అరుపులు వినబడ్డాయి
మార్కాపురం నుంచి సాయి కృష్ణ తీసుకొచ్చిన తర్వాత అతని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. అప్పుడు సిఐ నాగరాజు ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆమె అక్కడ ఉండగానే పై అంతస్తు నుంచి సాయి కృష్ణ కేకలు వేసినట్టు సమాచారం. ఇదే విషయాన్ని సాయి కృష్ణ మాతృమూర్తి సి పి దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు తన కొడుకుని చూడాలని ప్రాధేయపడినప్పటికీ సీఐ వినిపించుకోలేదని.. పోలీసులు కొట్టిన దెబ్బలకు తన కొడుకు తీవ్రంగా విలపించాడని ఆమె సిపి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.
నాడు పోలీసులు వ్యవహరిస్తున్న తీరును సాయి తల్లి తన చెల్లెలు, న్యాయవాది కనకదుర్గతో చెప్పింది. దీంతో ఆమె లాయర్లతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఆమె అడిగినప్పటికీ పోలీసులు ఎటువంటి సమాధానం చెప్పలేదు. ఫలితంగా హై కోర్టులో హెబియస్ కార్పస్ వేయాల్సి వచ్చింది. కాగా, సీఐ నాగరాజు తన కుమారుడిని చిత్ర హింసలకు గురి చేశారని, అందువల్లే అతడు చనిపోయాడని అతడి తల్లి ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని సీపీ తో చెప్పింది. తన కుమారుడి శవాన్ని తగలబెట్టారని, బూడిద కూడా కనిపించకుండా చేశారని ఆమె కన్నీటిపర్యంతమవుతోంది. అయితే ఆమె చెప్పిన వివరాలను విన్న సీపీ.. దర్యాప్తు అధికారులతో ఈ విషయాలను చెప్పినట్టు సమాచారం. వారు ఈకోణంలోనే శనివారం విచారణ సాగించినట్టు తెలుస్తోంది.
