Diwali gift for Farmers: ఏపీలో( Andhra Pradesh) రైతులకు గుడ్ న్యూస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందించే నగదు సాయంపై కీలక ప్రకటన వచ్చింది. ఒకేసారి రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయలు జమ కానుంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద ఏటా 6000 రూపాయలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం సమాంతరంగా అన్నదాత సుఖీభవ అమలు చేస్తోంది. గత వైసిపి ప్రభుత్వం రైతు భరోసా పేరిట అందించగా.. దానిని అన్నదాత సుఖీభవ పథకం గా మార్చింది కూటమి ప్రభుత్వం. ఈ ఏడాది ఆగస్టు రెండున పథకాన్ని అమలు చేసింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ అందించేందుకు సిద్ధపడుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 20 విడతల్లో మంజూరు చేసింది. తాజాగా 21వ విడత నిధులను విడుదల చేయడానికి సిద్ధమయింది.
పీఎం కిసాన్ తో కలిపి..
మోడీ( Prime Minister Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది. దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బంది పడుతున్న లక్షలాది మంది రైతులకు తక్షణసాయంగా ఈ నిధి ఉపకరిస్తోంది. అయితే ఇటీవల ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులకు నష్టం జరిగింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం 117 కోట్ల రూపాయల సాయం అందజేసింది. అయితే ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు సంబంధించి పి ఎం కిసాన్ ఈనెల 18న కానీ.. ఈనెల చివరి వారంలో కానీ నిధులు జమ చేసే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ రెండో విడత రూ.5000 కలిపి అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే తొలి విడతగా రూ.5000 అందించింది. చివరి విడతగా నాలుగు వేలు అందించనుంది.
వైసీపీ సర్కార్ కంటే అదనం..
తాము అధికారంలోకి వస్తే కేంద్రంతోపాటు సాగు ప్రోత్సాహం కింద ఏడాదికి 20వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు( CM Chandrababu) హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాన్ని అమలు చేయడం ప్రారంభించారు. గతంలో జగన్ హయాంలో రైతు భరోసా పేరిట పథకాన్ని అందించేవారు. అయితే రాష్ట్రం రూ.7500 అందించగా.. కేంద్ర ప్రభుత్వం రూ.6000 ఇచ్చేది. అంటే కేవలం ఈ పథకం ద్వారా రూ.13,500 మాత్రమే రైతులకు అందేది. కానీ కూటమి ప్రభుత్వం మొత్తం కలిపి 20 వేల రూపాయలు అందిస్తోంది. అంటే వైసిపి హయాంకంటే రూ.6,500 అదనం అన్నమాట. దీపావళి కానుకగా ఈనెల 18న అందిస్తారో? లేకుంటే ఈ నెల చివరి వారంలో అందిస్తారో? చూడాలి.