AP farmers scheme: ఏపీలో( Andhra Pradesh) రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ పథకం డబ్బుల విడుదలపై స్పష్టతనిచ్చింది. పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బుల విడుదలపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెనాయుడు సమీక్షించారు. ఈ అంశంపై అధికారులతో చర్చించారు. ఈనెల 19న రైతుల ఖాతాల్లో రూ.7000 జమ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ రెండో విడత రూ.2000, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం రూ.5000 కలిపి.. మొత్తం రూ.7000 చొప్పున జమ చేయనున్నారు. సీఎం చంద్రబాబు కడప జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 48 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ నగదు జమ కానుంది.
ఎన్నికల్లో హామీ మేరకు..
అధికారంలోకి వస్తే రైతులకు నగదు ప్రోత్సాహం కింద ప్రతి సంవత్సరం 20 వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు( CM Chandrababu) ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఆగస్టులో తొలి విడత నిధులు మంజూరు చేశారు. గత కొంతకాలంగా పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మూడు విడతల్లో 2000 రూపాయల చొప్పున మొత్తం రూ.6000 అందిస్తూ వచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం నిధులను సైతం మూడు విడతల్లో అందించేందుకు నిర్ణయించింది. తొలి రెండు విడతల్లో ఐదు వేలు, చివరి విడతల్లో నాలుగు వేలు అందించనుంది. ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వంతో కలిపి రూ.7000 జమ చేసింది. మరోసారి రూ.7000 అందించనుంది. చివరి విడతల్లో కేంద్రంతో కలిపి రూ.6000 అందించనుంది.
చనిపోయిన రైతుల వారసులకు..
తాజాగా ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ఈ పథకం అమలుపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఈరోజు సమీక్ష కూడా నిర్వహించారు. ఎవరైనా అర్హులైన రైతులు మరణిస్తే.. వారి వారసులకు డెత్ మ్యుటేషన్( death mutation ) చేసి పథకాన్ని వర్తింపజేయాలని ఆదేశించారు. అలాగే రైతుల బ్యాంక్ ఎకౌంట్లను క్రియాశీలకం చేయాలని.. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి సాంకేతిక సమస్యలతో చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఆధార్, మ్యాపింగ్లలో తప్పులు దొర్లడం.. ఒకే ఆధార్ నంబర్ను పలువురికి అనుసంధానం చేయడం, పట్టాదారు పాసుపుస్తకం నెంబర్ ను ఆధార్ తో సరిగ్గా లింక్ చేయకపోవడం వంటివి అడ్డంకులుగా మారాయి. దీనివల్ల అర్హులైన రైతులు పథకం ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. అందుకే అటువంటివి లేకుండా చూడాలని మంత్రి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈనెల 19న రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి.