Roja
Roja: వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress) పార్టీలో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కీలక నేతల నియోజకవర్గాల్లోనే మార్పులకు వెనుకడుగు వేయడం లేదు. ఎంతటి పెద్ద నేతైన పనితీరు మార్చుకోకపోతే ఆయన స్థానంలో కొత్త వారిని నియమిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాంను ఇన్చార్జి నుంచి తొలగించారు. ఆమదాలవలస నియోజకవర్గానికి ద్వితీయ శ్రేణి నాయకుడికి ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుకు సైతం యాక్టివ్ అవుతారా? మార్చేయమంటారా? అని అడిగేసరికి.. ఆయన సైతం అలెర్ట్ అయ్యారు. త్వరలో క్రియాశీలకం కానున్నారు. అయితే తాజాగా మాజీ మంత్రి రోజా విషయంలో సైతం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది.
Also Read: మహాకుంభ్ అయిపొయింది ప్రయాగ్ రాజ్ ఖాళీ అయ్యింది
* టిడిపిలోనే సుదీర్ఘకాలం
తెలుగుదేశం ( Telugu Desam) పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు ఆర్కే రోజా. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. జగన్ వెంట అడుగులు వేశారు. 2014లో నగిరి నియోజకవర్గంలో టిడిపి సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు పై విజయం సాధించారు. అంతకుముందు రెండుసార్లు టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి రెండోసారి గెలుపొందారు. అయితే మంత్రివర్గంలో ఛాన్స్ దక్కక పోవడంతో నిరాశకు గురయ్యారు. కానీ విస్తరణలో జగన్మోహన్ రెడ్డి ఆమెకు అవకాశం కల్పించారు. దీంతో మంత్రి పదవి ఆకాంక్ష అలా తీర్చుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆమె పరిస్థితి దయనీయంగా మారింది.
* తక్కువ మెజారిటీతో
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రెండుసార్లు గెలిచిన సమయంలో ఆమె మెజారిటీ 2000 లోపు మాత్రమే. ఈ ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు( gaali Muddu Krishna Naidu ) కుమారుడు గాలి భాను ప్రకాష్ దాదాపు 50 వేల ఓట్ల మెజారిటీతో రోజాపై గెలుపొందారు. నగిరి నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేక వర్గం బలంగా తయారైంది. వారికి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇటువంటి క్రమంలో అక్కడ నాయకత్వం మారిస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్స్ లేదని నివేదికలు అందాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయ నేత కోసం ఎదురుచూస్తున్నారు.
* గాలి కుటుంబంలో చీలిక
అయితే గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబంలో ఇప్పుడు చీలిక వచ్చింది. పెద్ద కుమారుడు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైన సోదరుడు భాను ప్రకాష్ ను ( MLA Bhanu Prakash ) విభేదిస్తున్నారు గాలి జగదీష్. అందుకే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. గాలి కుటుంబంలో చీలిక రావడంతో.. జగదీష్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రప్పించాలని ప్లాన్ చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. అయితే దీనిపై రోజా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒకానొక దశలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ కోసం ఎంతగానో శ్రమించానని.. ఇబ్బందులు కూడా పడ్డానని.. తనను మార్చడం ఏంటని ఆమె ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కానీ రోజాకు ప్రత్యామ్నాయ అవకాశాలు ఇచ్చి.. గాలి జగదీష్ కు నగిరి బాధ్యతలు అప్పగించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో గాలి తనయుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. అలా చేరిన తర్వాత గాలి జగదీష్ కు నియోజకవర్గ వైయస్సార్సీపి బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం.
Also Read: అధికారంలోకి వచ్చిన నెలలో 20 వేల మందికిపైగా అరెస్ట్.. అమెరికా జైళ్లలో అక్రమ వలసదారులు!