Roja: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ గుణపాఠాలు నేర్చుకోలేదు. ఎలాగూ చంద్రబాబు ఓడిపోతే తామే గెలుస్తాం అన్న ధీమా వారిలో ఉంది. అందుకే ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. గతంలో కూడా అధికారంలో ఉన్న వైసీపీని ప్రజలు ఓడించలేదు. వారి తప్పిదాలే వారిని ఓడించాయి. వారు అధికారంలో ఉన్నప్పుడు వాడిన భాష గురించి ప్రజలకు తెలుసు. వారికి చిరాకు వేసింది. అందుకే దరిదాపుల్లో కూడా రాకుండా ఓడించారు. కానీ ఎందుకో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దగా భయపడడం లేదని అర్థమవుతోంది. ప్రజలను వారు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. పార్టీ ఉంటే చాలు వారే గెలిపిస్తారులే అనే ధీమాతో ఉన్నారు. అయితే కొంతమంది నేతల భాష మితిమీరుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి రోజా మళ్లీ లైన్ లోకి వచ్చారు. మంగళవారం తన భాషలోకి వచ్చేసారు. పోలీసులను నీళ్లు లేని బావిలో దూకండి అంటూ సూచించారు. సీఎం చంద్రబాబును గాడు అంటూ సంబోధించారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయితే రోజా మాట్లాడే మాటలు కంటే ఆమె చూపించే హావభావాలు అభ్యంతరకరంగా ఉన్నాయి.
*ఆమె వైఖరి అంతే..
అయితే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అధికార పక్షాన్ని విమర్శించాలి. కానీ ఇదే రోజా లాంటి వారి వ్యాఖ్యల వల్లే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి మానసిక ఆనందాన్ని ఇచ్చేందుకు వ్యాఖ్యలు చేసి ఉంటారని అందరూ అంచనా వేశారు. కానీ ఆమె సహజ శైలి అంతే అనిపిస్తోంది. అసభ్య వ్యాఖ్యలతో తనదైన మార్క్ చూపిస్తున్నారు. మరోవైపు నోటికి తాళం వేసుకున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ లాంటి వారు సైతం మళ్లీ తెరపైకి వస్తారని రోజా లాంటివారు సంకేతాలు ఇస్తున్నారు.
* కలిసి వస్తున్న కూటమి ఆలోచన..
అయితే కూటమి ప్రభుత్వం కొన్ని రకాల పాలసీలను పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మహిళా నేతల విషయంలో ఇబ్బంది పెట్టకూడదని భావిస్తోంది. చంద్రబాబు ఈ విషయంలో మంచిగానే ఆలోచన చేస్తున్నారని పేర్ని నాని లాంటి నేత వ్యాఖ్యానించారు అంటే వైసీపీకి దీనిపై సమాచారం ఉంది. అయితే తమపై చర్యలు ఉండవని రెచ్చిపోతున్నారు రోజా. పాత పరిస్థితి మాదిరిగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. విడదల రజిని అయితే మాకంటూ ఒక ఛాన్స్ వస్తుంది కదా అంటూ హెచ్చరిస్తున్నారు. రోజా మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతి గురించి ప్రభుత్వం వద్ద సంపూర్ణమైన సమాచారం ఉంది. తిరుమల టికెట్లను అమ్ముకున్న వైనం దగ్గర నుంచి.. మంత్రిగా తన శాఖలో ఆడుదాం ఆంధ్ర పేరుతో సంపాదించుకున్న సొమ్ముల వరకు అన్ని లెక్క తీసి పెట్టారు. విజిలెన్స్ రిపోర్టు డిజిపి వద్దకు ఎప్పుడో చేరింది. కానీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతోనే ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.
* అది అలుసే..
నన్ను ఎవడు ఏం చేస్తాడు.. చేయగలడా? అని నిస్సిగ్గుగా ప్రశ్నించే తత్వం రోజాది. కచ్చితంగా ఆమె ప్రభుత్వ ఉదా సీనతను అలుసుగా తీసుకుంటారు. అందుకే ఇప్పుడు రెచ్చిపోతున్నారు రోజా. ఎంత రాజకీయ అవినీతికి పాల్పడ్డ.. మహిళా నేతలను అరెస్టు చేయవద్దని చంద్రబాబు భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అదే రోజా రెచ్చిపోవడానికి కారణం అవుతుంది. అయితే ఇదే ఉదాసీనతను ఆసరాగా తీసుకుని కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ దూకుడు కనబరిస్తే మాత్రం అది అంతిమంగా కూటమికే ఇబ్బందికరం. ఇప్పటికే ప్రజలు ఇంత ఘోరంగా తిరస్కరించినప్పుడు కూడా రప్పా రప్పా హెచ్చరికలు చేస్తున్నారంటే వారికి సరైన ట్రీట్మెంట్ తగలడం లేదు. అందుకే గట్టి చర్యలే తీసుకోవాలని టిడిపి క్యాడర్ కోరుతోంది.