Roja : సినిమా రంగం నుంచి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు రోజా. ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవులు చేపట్టారు. దూకుడుతనమే ఆమె సక్సెస్ కు కారణం. అదే దూకుడుతో ప్రజలకు, అధికారానికి దూరమయ్యారు. ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయినా రోజా తీరులో మార్పు రావడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ రోజా మాత్రం చాలా విషయాల్లో కనబరిచిన దూకుడు విమర్శలకు తావిచ్చింది. గతంలో ఓ సందర్భంలో మేం ఎస్సీలం కాదులే అంటూ వ్యాఖ్యానించారు. ఎవరో కలిసేందుకు వచ్చి దూరంగా ఉండిపోవడంతో ఆ కామెంట్ చేశారు. అప్పట్లో అది దుమారం రేపింది. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తమిళనాడులోని ఓ దేవస్థానంలో ఇదే తరహా ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు రోజా.
గత రెండుసార్లు నగిరి నియోజకవర్గం నుంచి తక్కువ మెజారిటీతో బయటపడ్డారు రోజా. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో మంత్రి అయ్యారు. కానీ సొంత పార్టీ శ్రేణులను సైతం కలుపుకొని వెళ్లలేక పోయారు. ఎన్నికల పోలింగ్ నాడే చేతులెత్తేశారు. పోనీబయట ఏమైనా కలివిడిగా ఉన్నారంటే అదీ లేదు. ప్రత్యర్ధులతో వ్యక్తిగత ఫైట్ కు సైతం దిగారు. విపరీతంగా శత్రువులను పెంచుకున్నారు. సోషల్ మీడియాకు సైతం టార్గెట్ అయ్యారు. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగన్ మెప్పు పొందేందుకు మెగా కుటుంబంపై సైతం ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె దారుణంగా ఓడిపోయారు. కానీ ఆమె వ్యవహార శైలి మాత్రంమారలేదు. ప్రజలతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలుసుకోకపోవడం వల్లే ఆమెకు ఈ పరిస్థితి వచ్చిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తాజాగా రోజా తన భర్త సెలవమనితో కలిసి తమిళనాడులోని తిరుచెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. అదే సమయంలో కొంతమంది పారిశుద్ధ్య కార్మికుల సైతం ఆసక్తి చూపారు. తాము కూడా సెల్ఫీ తీసుకుంటామని రోజాను అడిగారు. అయితే వారిని మాత్రం దూరంగా జరిగి నిల్చోవాలంటూ రోజా సూచించినట్లువీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వారు పక్కకు జరిగి సెల్ఫీ తీసుకున్నట్లు స్పష్టమౌతోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేశారు. అందులో రోజా వ్యవహరించిన తీరును చూసి నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రజలతో ఇలా దూరం వ్యవహరించడం వల్లే ఆమె మొన్నటి ఎన్నికల్లో వాటిని పాలయ్యారని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకు ఓటమి చెందిందో ఆమెకు ఇంకా అర్థం కానట్టే ఉందని మరికొందరు అంటున్నారు. రాష్ట్రం ఏదైనా పారిశుద్ధ్య కార్మికులను మరీ అంటరాని వాళ్ళుగా ట్రీట్ చేస్తారా అంటూ చాలామంది ఆమె తీరును అసహ్యించుకుంటున్నారు.
ఈ ఎన్నికల్లో ఓటమితో ఆమెకు తత్వం బోధపడిందని అంతా భావించారు. ఇటీవల ఆమె రాజకీయ కామెంట్స్ కూడా తగ్గించారు. ప్రస్తుతం కూడా పెద్దగా మాట్లాడడం లేదు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం లోనే రాజకీయాల గురించి మాట్లాడేవారు. రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత కామెంట్స్ చేసేవారు. ఇటీవల అటువంటి వాటిని తగ్గించారు. అసలు రాష్ట్రంలో కూడా పెద్దగా కనిపించడం లేదు. కానీతమిళనాడు ఆలయానికి వెళ్లి.. ఇలా పారిశుధ్య కార్మికుల విషయంలో ప్రవర్తించడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. సోషల్ మీడియాలో ఇదే వైరల్ అంశంగా మారింది. టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. తెగ ట్రోల్ చేస్తున్నాయి. ఆమెకు సంస్కారం లేదంటూ ఎక్కువమంది కామెంట్స్ చేస్తున్నారు.