RK Kothapaluku: శకునం చెప్పే బల్లి కుడితిలోనే పడుతుందట. అలాగే నీతి వ్యాఖ్యలు చెప్పే వాళ్ళకు గతంలో వారు ఎలాంటి మాటలు అన్నారో గుర్తుండదట. ఇప్పుడు ఎందుకు ఈ మాటలు చెబుతున్నామంటే.. తెలుగు నాట ప్రసిద్ధ పాత్రికేయులలో వేమూరి రాధాకృష్ణ ఒకరు. కాకపోతే ఆయన చేసే వ్యాఖ్యలకు.. రాసే రాతలకు లంకె ఉండదు.. కొన్నిసార్లు సత్య హరిచంద్రుడి లాగా.. మరి కొన్నిసార్లు పసుపు రంగు పూసుకున్న పోతురాజు లాగా రాస్తుంటారు. అందుకే ఆయన జర్నలిజంలో బ్యూటీని ఒక పట్టాన అంచనా వేయలేం.
ప్రతి ఆదివారం తన ఆంధ్రజ్యోతి పత్రికలో వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు పేరుతో వర్తమాన రాజకీయాలపై తనదైన విశ్లేషణ చేస్తుంటారు. ఈ ఆదివారం కొత్త పలుకులో దేశంలో రాజకీయ పార్టీల మీద పడ్డారు.. ఏపీలో తెలుగుదేశం నుంచి మొదలు పెడితే కర్ణాటకలో కాంగ్రెస్ వరకు దేనినీ వదిలిపెట్టలేదు. శ్రీలంక సర్వనాశనమైందని.. గ్రీస్ దేశం కుప్పకూలిందని.. వెనిజులా అప్పుల కుప్పలా మారిందని.. ఎన్నికల్లో గెలవడానికి ప్రజలకు ఉచిత హామీలు ఇచ్చుకుంటూ పోతే చివరికి చిప్పే మిగులుతుందని.. తొడుక్కోవడానికి గోచిగుడ్డ కూడా ఉండదని.. ప్రజలు చెల్లించే పన్నులను ఇష్టానుసారంగా ఖర్చు పెట్టే అధికారం ప్రభుత్వాలకు ఎక్కడిదని.. ఇలా భాస్వరం లాగా మండిపోయారు రాధాకృష్ణ. ఒక జర్నలిస్టు కోణంలో రాధాకృష్ణ అగ్నిగోళం లాగా మండిపోయారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. గతంలో రాధాకృష్ణ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే మంచిది.
సూపర్ సిక్స్ పై నిలదీయలేదేం..
ఏపీలో ఎన్నికలకు ముందు కూటమి నాయకులు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు పంచుకుంటూ వెళ్లారని ఆరోపించిన నాయకులు.. వారు మాత్రం మరిన్ని పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సహజంగా దీనిని విమర్శించాల్సిన రాధాకృష్ణ.. తన పత్రికలో సూపర్ సిక్స్ పథకాలపై అనుకూల కథనాలు రాయించారు. దాదాపు నెలలపాటు ఇదే ప్రచారాన్ని సాగించారు. మరి ఇప్పుడు ఇతర పార్టీలు ఉచితాలు ప్రకటిస్తుంటే మండిపడుతున్న రాధాకృష్ణకు.. నాడు సూపర్ సిక్స్ పథకాలు తప్పు లాగా కనిపించలేదా? ఆ సూపర్ సిక్స్ పథకాల వల్ల ప్రభుత్వ ఖజానాకు బొక్క పడుతుందని తెలియలేదా? సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోయినప్పటికీ కూటమి అధికారంలోకి వచ్చేదని చెబుతున్న రాధాకృష్ణ.. మరి ఆ విషయాన్ని చంద్రబాబుకు చెప్పలేకపోయాడా? పోనీ చంద్రబాబుకు ఆ విషయం చెప్పలేదనుకున్నాం.. సూపర్ సిక్స్ పథకాలపై తన పత్రికలో అనుకూల కథనాలు ఎందుకు రాయించినట్టు? ఇవాళ ఉచితాలు భారం అంటూ అంకమ్మ శివాలు ఊగడం దేనికి? ఇదేనా రాధాకృష్ణ చెప్పుకునే గొప్ప పాత్రికేయం?
ఆ దమ్మే ఉంటే..
మాట్లాడితే దమ్మున్న పత్రిక అని చెప్పే రాధాకృష్ణ.. తన ఆంధ్రజ్యోతి సర్క్యూషన్ పెంచుకోవడానికి కారు రేసు, బంపర్ డ్రా అంటూ స్కీం లు పెట్టడం దేనికి? ప్రతినెల కూపన్లు పబ్లిష్ చేయడం దేనికి? అంటే ఇది కూడా ఉచితాల కిందికి రాదా? ఆంధ్రజ్యోతిలో నేటికీ అంతంతమాత్రంగానే ఉద్యోగులకు జీతాలు ఉన్నాయి. ఈ స్కీం కు వెచ్చించే డబ్బులను ఉద్యోగులకు ఇస్తే వారు సంబరపడతారు కదా. మరింత గొప్పగా పనిచేస్తారు కదా.. అయినా వార్తల్లో దమ్ము లేనప్పుడు.. పత్రికలో నిజాయితీ లేనప్పుడు..ఈ స్కీం లు మాత్రం సర్కులేషన్ పెంచుతాయా? పార్టీలు అందించే ఉచితాల మీద విమర్శలు చేసే వేమూరి రాధాకృష్ణ.. ఈ కార్ స్కీంపై.. బంపర్ డ్రాలపై ఎందుకు ఆత్మ విమర్శ చేసుకోడు.. అందుకే అంటారు గురిగింజ తన నలుపు ఎరుగదని.. ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉందిగాని.. తూర్పార పట్టడం ఎక్కువవుతున్నదని ఇక్కడితో ముగిస్తున్నాం.