RK Kotha Paluku: అది చంద్రబాబు ఆస్థాన పత్రిక అయినప్పటికీ.. ఈమధ్య ఎందుకో తోక జోడిస్తోంది. అడుగడుగునా పుల్లలు పెట్టే ప్రయత్నం చేస్తోంది. అడ్డు తగిలే వ్యవహారాలకు పాల్పడుతోంది. వాస్తవానికి ఆంధ్రజ్యోతి ఇలా చేస్తుందని టిడిపి క్యాంప్ ఊహించి ఉండదు. మరీ ముఖ్యంగా చంద్రబాబు ఇలా ఆలోచించి ఉండడు. మన రాధాకృష్ణ నే కదా.. మనకు సపోర్ట్ చేసేవాడే కదా.. అలా ఎందుకు చేస్తాడని చంద్రబాబుకు మొదటినుంచి గట్టి నమ్మకం. కాకపోతే ఆ నమ్మకం ఇటీవల ఎందుకో సడలిపోయింది. ఫెవికాల్ లాంటి బంధం బీటలు వారి పోయింది. ఒకానొక దశలో ఆంధ్రజ్యోతి రాస్తున్న రాతలను వైసిపి తన అధికారిక సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. సాక్షి చూడలేని కోణాన్ని.. వైసిపి ఆలోచించలేని విధానాన్ని ఆంధ్రజ్యోతి చేసి చూపించింది. మామూలుగా కాదు కూటమి ప్రభుత్వంపై పిచ్చిపిచ్చిగా వ్యతిరేక కథనాలను ప్రచురించింది, ప్రసారం కూడా చేసింది.
అయితే ఇన్నాళ్లకు చంద్రబాబు మీద దయ చూపించింది ఆంధ్రజ్యోతి. ఆదివారం నాటి కొత్త పలుకులో చంద్రబాబు మీద రాధాకృష్ణ ప్రేమని కనబరిచారు. ఒకప్పటి భక్తిని ప్రదర్శించారు. చంద్రబాబును బాహుబలి లో ప్రభాస్ ఎత్తయిన విగ్రహం స్థాయిలో నిలబెట్టారు. చంద్రబాబు గొప్పవాడని.. వైద్యాన్ని పేద ప్రజలకు దగ్గర చేస్తున్నాడని.. ఈ విషయం తెలియక జగన్ కడుపుమంటతో అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నాడని.. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వ్యవహరిస్తున్నాడని.. ఇలా రాధాకృష్ణ రాసుకుంటూ పోయాడు. వాస్తవానికి ఇంతటి వ్యాసంలో కనీసం తెలంగాణ ప్రస్తావన తీసుకురాలేదు. బనకచర్ల విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఎంతసేపటికి పిపిపి విధానం మీద మాత్రమే రాధాకృష్ణ తన రాతలను రాశాడు. అంతేకాదు చంద్రబాబు ఆలోచన గొప్పదని.. నేటి రోజుల్లో ప్రవేట్ భాగస్వామ్యం లేకపోతే ప్రభుత్వాలు ఏమీ చేయలేవని స్పష్టం చేశాడు. ప్రవేట్ విధానం మంచిదని.. గవర్నమెంట్ విధానాల వల్ల జవాబుదారితనం లోపిస్తోందని స్పష్టం చేశాడు. మరి ఇదే రాధాకృష్ణ ప్రభుత్వ రంగ సంస్థలలో కేంద్రం పెట్టుబడులను ఉపసంహరించుకుంటే ఎందుకు వ్యతిరేక వార్తలు రాసినట్టు.. చంద్రబాబు పీ4 పథకాన్ని ఎందుకు వ్యతిరేకించినట్టు?
వైద్యరంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం మంచిదే ఆని సూక్తులు చెప్పిన రాధాకృష్ణకు.. కనీసం మెడికల్ కాలేజీలు కూడా నిర్మించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండిపోవడం తప్పుగా అనిపించలేదా.. ఏటా వేల కోట్ల ఆదాయం.. విస్తారమైన వనరులు.. ముందుచూపు బాగా ఉన్నదని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. కనీసం మెడికల్ కాలేజీలు కూడా నిర్మించాలని దరిద్రంలో ఉండడం వ్యతిరేకంగా అనిపించలేదా.. పంచుడు పథకాలకు అలవాటు పడిన ప్రభుత్వాలకు ప్రజలకు మేలు చేయాలని సోయి లేదు. పంచుడు పథకాలకు వ్యతిరేకంగా ఉండే చంద్రబాబు కూడా సూపర్ సిక్స్ ను ప్రవేశపెడతామన్నారు. వాటి అమలులో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పథకాల వల్లే కదా ఇలాంటి నిర్మాణాలు ముందుకు పడనిది. పంచుడు పథకాలు పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబును కదా రాధాకృష్ణ విమర్శించాల్సింది.. జగన్ ఇలా చేస్తేనే బటన్ సీఎం అని విమర్శించిన రాధాకృష్ణ.. ఇప్పుడు పంచుడు పథకాలు అమలు చేస్తున్న చంద్రబాబును ఎందుకు విమర్శించరు? ఏతా వాతా ఏం జరిగిందో తెలియదు కానీ.. మొత్తానికి అయితే ఈ వారం చంద్రబాబుకు అనుకూలంగా మారిపోయారు రాధాకృష్ణ.. పీ 4 స్కీమ్ ను వ్యతిరేకించిన ఆయన.. పీపీపీ విధానాన్ని సమర్థించడం నిజంగా గొప్ప విషయమే.. మరి ఇలాంటి పాత్రికేయాన్ని ఏమంటారో రాధాకృష్ణనే సెలవియ్యాలి.