RK Kotha Paluku: కొన్ని విషయాలను మొహమాటం లేకుండా చెప్పడంలో.. కుండ బద్దలు కొట్టడంలో ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ సిద్ధహస్తుడు. స్వతహాగానే ఇతడు జర్నలిస్ట్. పైగా రాజకీయంగా చాలా విషయాలు తెలిసిన వ్యక్తి. అందువల్లే తన పత్రికలో ప్రతి ఆదివారం రాసే కొత్త పలుకులో సంచలన విషయాలను బయట పెడతారు రాధాకృష్ణ.
కొన్ని సందర్భాలలో వాస్తవానికి విరుద్ధంగా ఆయన రాతలు ఉన్నప్పటికీ.. మిగతా సందర్భాలలో మాత్రం ఓపెన్ గానే చెప్పేస్తుంటారు. తాజాగా రాసిన కొత్త పలుకులో వేమూరి రాధాకృష్ణ ఏపీ రాజకీయాల గురించి.. తెలంగాణ రాజకీయాల గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. జగన్, కేసీఆర్ మధ్య ఫెవికాల్ సంబంధం ఉందని.. కెసిఆర్ కు కష్టం వస్తే జగన్ సోషల్ మీడియా బాధపడుతోందని.. ఇప్పుడు నల్లమల ప్రాజెక్టు విషయంలో చంద్రబాబును తిడుతున్న కెసిఆర్ అండ్ కో.. రాయలసీమ లిఫ్ట్ విషయంలో ఎందుకు మౌనంగా ఉందని రాధాకృష్ణ ప్రశ్నించారు.
అంతేకాదు, ఏపీలో కాపు, కమ్మ కలిసిపోయారని.. రెండు కులాలకు సంబంధించిన వారంతా రాజకీయంగా ఒకే వేదికను పంచుకుంటున్నారని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు.. అధికారంలో లేరు కాబట్టి ప్రాంతాల మధ్య విద్వేషాలను రగల్చడంలో కెసిఆర్, జగన్ సిద్ధహస్తులని.. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారని రాధాకృష్ణ వాపోయారు.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. గతంలో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించినప్పుడు.. రాధాకృష్ణ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? ఎలాంటి వార్తలు రాశారు? చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఎవరికోసం పనిచేస్తుందని చెప్పారు? అవన్నీ తెలుగు ప్రజలకు గుర్తు ఉన్నాయి. ఇవాళ పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన శక్తి లాగా రాధాకృష్ణకు కనిపిస్తూ ఉండవచ్చు. 2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ భార్యను రేణు దేశాయ్ ని రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇంకా చెప్పాలంటే జనసేన పార్టీకి సంబంధించి చాలా రకాలుగానే ఆంధ్రజ్యోతి పత్రిక వార్తలు రాసింది.
పవన్ కళ్యాణ్ స్థాయిని తక్కువ అంచనా వేసి చూసింది. కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూటమిలో కీలకం కావడం.. కేంద్రంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో అనివార్యంగా పవన్ కళ్యాణ్ పల్లవిని రాధాకృష్ణ ఎత్తుకున్నారు. అంతేకాదు, కమ్మ, కాపు సామాజిక వర్గాలు కలిసిపోయాయని పేర్కొన్నారు. జగన్ అనవసరంగా గొడవ పెడుతున్నారని మండిపడ్డారు. కానీ, గతంలో వైఎస్, అంతకుముందు చంద్రబాబు.. హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇవాళ రాధాకృష్ణ షుగర్ కోటెడ్ రాతలు రాసినంత మాత్రాన వాస్తవాలు చెరిగిపోవు.
