RK Kotha Paluku: కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై ఎన్ టివి ప్రసారం చేసిన కథనం తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇది అనేక రకాల మలుపులు తిరిగింది. చివరికి ఎన్టీవీ క్షమాపణ చెప్పకుండా.. ఏదో విచారం వ్యక్తం చేసింది. తన తప్పు ఏది లేదన్నట్టుగా.. ఏదో కావాలని ఇబ్బంది పెడుతున్నట్టుగా ఎన్టీవీ పేర్కొంది.
దీనిపై రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ బృందం కాస్త ఎన్టీవీ ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్, ఇంకా ఇద్దరు రిపోర్టర్లను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత వారిని ప్రశ్నించింది. ఈ లోగానే కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అసలు కథ ఇప్పుడే మొదలైంది.
ఎన్టీవీ కథనాన్ని ఎందుకు ప్రసారం చేయాల్సి వచ్చింది? కోమటిరెడ్డి కి మహిళ ఐఏఎస్ అధికారికి సంబంధం ఉన్నది నిజమేనా? ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా? ఈ విషయాలకు మిగతావారేమో తెలియదు గాని.. ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ మాత్రం స్పష్టమైన సమాధానం చెప్పారు. మిగతా విషయాలలో అతని మీద చాలామందికి ఒక రకమైన వ్యతిరేక కోణం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో మాత్రం రాధాకృష్ణ అసలు నిజాలను బయటపెడతాడు. ఇప్పుడు ఎన్టీవీ కథనం వెనుక కూడా అసలు నిజాన్ని రాధాకృష్ణ బయటపెట్టాడు. గులాబీ పార్టీ, వైసిపి మొత్తుకుంటున్న అసలు పత్రికా స్వేచ్ఛను బయటపెట్టాడు.
ఆంధ్రజ్యోతిలో ఆదివారం రాసిన కొత్త పలుకు వ్యాసంలో రాధాకృష్ణ ఏమంటాడంటే… ఒడిశా ప్రాంతంలోని నైనీ బ్లాక్ మొత్తం ఎన్టీవీ బురద కథనానికి ఆధారం. వాస్తవానికి ఈ బ్లాక్ సింగరేణి సంస్థకు ఎప్పుడో దక్కింది. అయితే అందులో తవ్వకాలను ప్రైవేట్ కంపెనీకి అప్పగించడానికి కేసీఆర్ ప్రణాళిక రూపొందించాడు. వాస్తవానికి సింగరేణికి ఆ సామర్థ్యం ఉన్నప్పటికీ..ఎందుకు తవ్వకాలు జరపకుండా ఆపారో ఇప్పటికీ ఒక మిస్టరీనే!
అదాని కంపెనీని ముందు పెట్టి.. ప్రతిమ శ్రీనివాస్ అనే వ్యక్తికి అప్పగించడానికి అప్పట్లో కేసీఆర్ పావులు కదిపారు. అయితే ఆ కాలంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నైని బ్లాక్ తవ్వకాలను తన సోదరుడి కంపెనీకి అప్పగించడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిశారు. ఈ విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయవంతమయ్యారు. కానీ ఈ కథ ఇక్కడితోనే పూర్తి కాలేదు.
కాంగ్రెస్ 2023లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొత్తానికి మంత్రి అయ్యారు. అయితే ఇదే క్రమంలో 90 బ్లాక్ టెండర్లు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. అయితే ఈసారి ఊహించని విధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క, ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి సీన్లోకి వచ్చారు. బొగ్గు తవ్వకానికి సంబంధించి వీరిద్దరికి ఎటువంటి అనుభవం లేదు. దీంతో ప్రఖ్యాతమైన మేఘా(mega engineering infrastructure limited) కంపెనీతో సంయుక్త వెంచర్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నారు.
తవ్వకాలలో భారీగా అనుభవమున్న కంపెనీలు పోటీ పడితే.. మరీ ఈ జాయింట్ పరిస్థితి ఏమిటి? టెండర్ ఎలా దక్కించుకోవాలి? ఇందుకోసమే ఒక విచిత్రమైన నిబంధనలను తెరపైకి తీసుకొచ్చారు. పైగా ఇప్పుడు సింగరేణి సంస్థ కూడా భట్టి ఆధీనంలో ఉన్నట్టే లెక్క. నైనీ బ్లాక్ పరిధిలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే.. ఆ సంస్థకు పరిశీలన ధ్రువపత్రం అందిస్తామని.. వాళ్లు మాత్రమే టెండర్ లో పాల్గొనాలని తేల్చి చెప్పారు. అంతేకాదు, ఆ ధ్రువ పత్రం కేవలం తాను నిర్ణయించుకున్న కంపెనీలకు ఇచ్చే విధంగా నిబంధన విధించినట్టు తెలుస్తోంది. ఈ ప్రకారం జాయింట్ వెంచర్ కంపెనీకి మాత్రమే బొగ్గు తవ్వకం అనుమతులు ఇచ్చి.. మిగతా కంపెనీలను టెండర్లకు దూరం చేస్తారనేది అసలు ప్రణాలిక..
ఇక ఈ వ్యవహారంలో ఎన్టీవీ నరేంద్ర చౌదరికి దక్కే ప్రయోజనం కూడా భారీగానే ఉందట. నరేంద్ర చౌదరి అల్లుడికి సంబంధించిన వెన్సర్ కంపెనీ ఆ జాయింట్ వెంచర్ లో ఉందని తెలుస్తోంది. ఇక్కడ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుపడ్డట్టు తెలుస్తోంది. తన సోదరుడి కంపెనీకి తవ్వకాలు చేపట్టడానికి.. టెండర్లలో పాల్గొనడానికి అర్హతలు ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా కోమటిరెడ్డిని అడ్డగించడానికి ఎన్టీవీ ఈ తరహాలో బురద కథనానికి పాల్పడిందని ఆరోపణ వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డిని బ్లాక్ మెయిల్ చేసి.. ఇబ్బంది పెట్టడానికి ఈ విధమైన వ్యక్తిత్వ హనానికి పాల్పడినట్టు విమర్శలు ఉన్నాయి. చేతిలో మీడియా ఉండడం మహిళ ఐఏఎస్ తో మంత్రికి సంబంధం అంటగట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు సదరు మహిళా అధికారి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో.. కేంద్ర సర్వీస్ అధికారులు ఏకతాటి మీదికి వచ్చారు. ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఇదే క్రమంలో జర్నలిస్టులను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వాస్తవానికి ఎన్టివి యాజమాన్యం చెప్పినట్టుగానే జర్నలిస్టు చేశారు. ఇందులో వారికి సంబంధించిన ఉద్దేశపూర్వకమైన తప్పు కనిపించడం లేదు. ఇక ఇదే సమయంలో చూసీ చూడనట్టు పోవాలని భట్టి విక్రమార్క చెప్పినప్పటికీ.. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు వినిపించుకోలేదట.
ఇంత జరిగిన తర్వాత.. ఇప్పుడు రేవంత్ ఏం చేస్తారు? ఇద్దరు మంత్రులు ఎవరి పై చర్యలు తీసుకుంటారు? దీనికి తోడు మీడియా సంస్థల బురద కథనాలు.. ఉన్నతాధికారులు ఇలాంటి ఇబ్బందులు పడితే కచ్చితంగా పరిపాలన మీద ప్రభావం చూపిస్తుంది. ఎన్టీవీ కథనం వల్ల నైనీ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. . ఇప్పుడు రేవంత్ టెండర్లు రద్దు చేసి, నిబంధనలు మొత్తం పక్కన పెట్టి.. పారదర్శకంగా వ్యవహరించి.. అన్ని అర్హతలు ఉన్న కంపెనీకి బొగ్గు తవ్వకాలు దక్కేలా చూడాలని డిమాండ్ కనిపిస్తుంది.
ఇక్కడ ఎన్టీవీ అధినేత తన ప్రయోజనాల కోసం మంత్రి మీద అడ్డగోలుగా కథనాలను ప్రసారం చేయించారు. ఓ మహిళా అధికారి మీద ఈ స్థాయిలో విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమో నరేంద్ర చౌదరి చెప్పాలి. ఇక్కడ సమాజం థూ అని ఉమ్మే సరికి పత్రిక స్వేచ్ఛ అవసరం పడ్డాయి..అన్నట్టు జగన్ అధికారంలో ఉన్నప్పుడు, కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలినప్పుడు పాత్రికేయుల మీద ఎలాంటి దాడులు జరిగాయో అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రతిపక్షంలో (జగన్ కు ఆస్థాయి కూడా లేదు) ఉన్నారు కాబట్టి.. నీతి వాక్యాలు చెబుతున్నారు.
