Homeఆంధ్రప్రదేశ్‌Revanth Reddy : చంద్రబాబు కాంగ్రెస్ లో ఉంటే ప్రధాని అయ్యేవారు.. రేవంత్ సంచలన కామెంట్స్

Revanth Reddy : చంద్రబాబు కాంగ్రెస్ లో ఉంటే ప్రధాని అయ్యేవారు.. రేవంత్ సంచలన కామెంట్స్

Revanth Reddy : చంద్రబాబు సమర్థవంతమైన నేత. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా ఇందులో వాస్తవం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. అనతి కాలంలోనే తెలుగుదేశం పార్టీపై పట్టు సాధించారు. అదే పార్టీని హస్తగతం చేసుకున్నారు. అయితే దీనిని వెన్నుపోటు అని కొందరు… అనివార్య పరిస్థితి అని మరికొందరు.. ఇలా ఎవరికి వారు విశ్లేషణలు చెబుతుంటారు. చంద్రబాబు సైతం నాటి పరిస్థితులను సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం కూడా చేశారు. అయితే చంద్రబాబుకు ప్రజలు అవకాశం ఇవ్వడం ద్వారా వెన్నుపోటు అన్న అపవాదు నుంచి తప్పించారు. అయితే ఇంకొకటి వాస్తవం తెలుగుదేశం పార్టీని విజయవంతంగా నడపడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఎన్నో రకాల ఆటుపోట్లు ఎదురయ్యాయి. సంక్షోభాలు చవిచూశారు. వాటన్నింటినీ సమర్థవంతంగా అధిగమించగలిగారు చంద్రబాబు. ఒక ప్రాంతీయ పార్టీ నాలుగు దశాబ్దాల పాటు ఉనికి చాటుకోవడం అంత ఈజీ కాదు. కానీ తెలుగుదేశం పార్టీని విజయవంతంగా నడపడమే కాదు.. జాతీయ స్థాయిలో సైతం నిలబెట్టగలిగారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబుకు ప్రధాని అయ్యే ఛాన్స్ వచ్చింది. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు.

* సీనియర్ మోస్ట్ లీడర్
ఇండియన్ పొలిటికల్ హిస్టరీ లో చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్. జాతీయస్థాయిలో రాణించగల నేర్పరితనం ఆయన సొంతం. ఎంతోమంది నేతలను ప్రధానులుగా చేశారు. కానీ ఆయన మాత్రం ప్రధాని కాలేదు. చంద్రబాబును ప్రధానిగా చూడాలన్నది చాలామంది కోరిక. అటువంటి జాబితాలో తాజాగా చేరారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయనకు మీడియా నుంచి ఒక ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానం చెబుతూ.. కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు ఉండి ఉంటే ఈ దేశానికి ప్రధాని అయి ఉండేవారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఒక్కప్పటి సన్నిహితుడు రేవంత్ తెలంగాణ సీఎం కావడం వెనుక చంద్రబాబు హస్తం ఉందన్న కామెంట్స్ వినిపించాయి. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన అనతి కాలంలోనే సీఎం స్థాయికి ఎదిగారు రేవంత్. ఇప్పటికీ చంద్రబాబు విషయంలో కృతజ్ఞత గానే మాట్లాడుతుంటారు. ఇప్పుడు కూడా అదే తరహా వ్యాఖ్యలు చేయడం విశేషం.

* ఆ సమర్థత ఆయనలో ఉంది
అయితే రేవంత్ మాటల్లో స్వార్థం ఉండవచ్చు కానీ.. ఈ దేశానికి ప్రధాని అయ్యే సమర్థత చంద్రబాబులో ఉంది. కాంగ్రెస్ పార్టీ ద్వారానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు చంద్రబాబు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకుడు కూడా. ఆ ఇద్దరు నేతలు 1978లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఇద్దరూ గెలిచారు. ఇద్దరూ మంత్రులయ్యారు. కానీ 1983లో వచ్చిన తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్ పార్టీని కకావికలం చేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గానే పోటీ చేసిన చంద్రబాబు టిడిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అప్పుడే తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. దీంతో కాంగ్రెస్ తో ఉన్న బంధాన్ని తెంచుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో త్వరితగతిన పట్టు పెంచుకోగలిగారు బాబు. టిడిపి ద్వారానే జాతీయ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటే… ఆ స్థాయికి చేరుకునేవారా? అంత అవకాశం ఉంటుందా? అన్నది అనుమానమే. కానీ చంద్రబాబు తన సమర్థతతో, తెలివితేటలతో రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చారు. అయితే ఏ నాయకుడికైనా పార్టీ అన్నది ముఖ్యం. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్లో రాణించాలంటే హై కమాండ్ అండ అవసరం. అయితే ఆ హై కమాండ్ అనేదితన చేతుల్లోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీని జాతీయస్థాయిలో నిలబెట్టారు. ప్రధాని కాలేకపోయారు కానీ.. అంతకుమించి అన్నట్టు గుర్తింపు పొందారు బాబు. అంతటితోనే సంతృప్తి చెందుతున్నట్లు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ప్రధాని పదవిపై తనకు దృష్టి లేదని తేల్చి చెప్పారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular