CM Revanth Reddy: కేకే ఇంటికి రేవంత్ రెడ్డి.. 3 సార్లు పవర్ కట్!

రాష్ట్రంలో కరెంట్ పోవద్దని శనివారం మధ్యాహ్నం అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కరెంటు కోతలు విధిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 31, 2024 12:49 pm

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: “రాష్ట్రంలో కరెంటు కోతలు ఉన్నాయి. అడ్డగోలుగా పవర్ కట్స్ విధిస్తున్నారు. రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు నరకం చూస్తున్నారు. పారిశ్రామిక వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా.. ఇలాంటి కోతలు విధించేందుకేనా అధికారంలోకి వచ్చింది? అదే కేసీఆర్ అధికారంలో ఉంటే ఇలా జరిగి ఉండేదా?” ఇలానే భారత రాష్ట్ర సమితి నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఆ పార్టీ అనుకూల మీడియా ఎండిన పొలాల ఫోటోలతో వార్తలు రాస్తోంది. సరే అదంటే ప్రతిపక్ష పార్టీ కాబట్టి.. ఆ పత్రిక ప్రతిపక్ష పార్టీ కరపత్రం కాబట్టి.. అలానే ఉంటుందనుకుందాం. భారత రాష్ట్ర సమితి ఆరోపిస్తున్నట్టే క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఉన్నట్లు కనిపిస్తోంది.

రాష్ట్రంలో కరెంట్ పోవద్దని శనివారం మధ్యాహ్నం అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కరెంటు కోతలు విధిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. ఎక్కడ సమస్య ఉన్న వెంటనే పరిష్కరించాలని.. ఎండాకాలంలో కరెంటు కోతలకు తావు లేదని స్పష్టం చేశారు. కానీ సాయంత్రానికే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుభవంలోకి వచ్చింది. విద్యుత్తు రంగంపై సమీక్ష చేపట్టిన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో విద్యుత్ కు డిమాండ్ పెరిగిందని.. నిమిషం కూడా కరెంటు పోవద్దని అధికారులను ఆదేశించారు. కానీ వారు ఆయన ఆదేశాలను పెద్దగా ఆచరణలో పెట్టినట్టు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి ఆదేశించిన గంటల వ్యవధిలోనే కరెంటు పోవడం అధికార పార్టీ నాయకులను హతాశులను చేసింది.

శనివారం సాయంత్రం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ కేశవరావు నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యారు. ఒకటి కాదు రెండు కాదు వారు మాట్లాడుతుండగానే మూడుసార్లు కరెంటు పోయింది. ఏకంగా ముఖ్యమంత్రి భేటీలోనే మూడుసార్లు కరెంటు పోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు అకస్మాత్తుగా అక్కడికి వచ్చారు. విద్యుత్ ప్రసారాన్ని పునరుద్ధరించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

“కరెంట్ పోవద్దని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. నిమిషం కరెంటు పోయినా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అలా లేదు. ముఖ్యమంత్రి సమావేశంలో ఉండగానే కరెంటు పోయింది. ఏకంగా మూడుసార్లు ఇలా విద్యుత్ కోతలు విధించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికే ఇలాంటి అనుభవం ఎదురైతే.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? కరెంటు కోతలు లేవని ప్రభుత్వం చెబుతోంది.. ముఖ్యమంత్రి భేటీ అయిన సమావేశంలోనే కరెంటు కోతల విధించారు. ఇంతకంటే సజీవ ఉదాహరణ ఇంకేముంటుందని” ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి నాయకులు ఆరోపిస్తున్నారు. “కరెంటు కోతలు విధిస్తున్నది నిజం. కరెంటును సరిపడా ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది అబద్ధం. అది ముఖ్యమంత్రి భేటీలోనే తేలిపోయింది. ఇక ఇంతకుమించి అబద్ధాలు ఆడినా అతకదు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటో ప్రజలకు అర్థమయిపోయింది. దీని కోసమేనా రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నది” అంటూ భారత రాష్ట్ర సమితి నాయకులు విమర్శలు చేస్తున్నారు.