AB Venkateswara Rao: ఏపీలో( Andhra Pradesh) కొత్త రాజకీయ పార్టీ తెరపైకి రానుంది. సుదీర్ఘకాలంగా ఉన్న రాజకీయ సమీకరణలను సవాల్ చేస్తూ కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటించారు. కొద్దిరోజుల కిందట ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. దీంతో తెలుగుదేశం పార్టీలో చేరుతారని ఊహాగానాలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగా ఆయనకు నామినేటెడ్ పదవి కూడా ఆఫర్ చేసింది టిడిపి ప్రభుత్వం. కానీ ఆ పదవి తన స్థాయికి తగ్గట్టు చాలదని.. జగన్మోహన్ రెడ్డి మూలంగా తాను కోల్పోయిన కొలువు కంటే గొప్పది కాదని భావించిన ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది. కానీ త్వరలో రాజకీయ పార్టీ ఉంటుందని మాత్రం ఆయన చాలా సందర్భాల్లో సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు పార్టీకి అవసరమైన ఆర్థిక వనరులు సమకూరాయని.. అందుకే పార్టీని పెడతానని చెబుతున్నారు.
జగన్ సర్కార్ బాధితుడిగా..
ఏబీ వెంకటేశ్వరరావు( ab Venkateswara Rao ) సీనియర్ ఐపీఎస్ అధికారి. టిడిపి హయాంలో ఆయన ఇంటలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించారు. పైగా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అందుకే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై వేటుపడింది. వాస్తవానికి ఆయన డిజిపిగా ప్రమోట్ కావాల్సిన వ్యక్తి. ఆ పోస్టు ఇవ్వకపోగా జగన్ సర్కార్ ఆయనను వెంటాడింది. ఏ పోస్టు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. చివరకు న్యాయస్థానం తీర్పుతో పదవీ విరమణ రోజు ఆయన పోస్టింగ్ పొందారు. జగన్ హయాంలో తనకు అవమానం జరగడాన్ని తట్టుకోలేకపోయారు. అందుకే తెలుగుదేశం పార్టీలో చేరి ఉన్నత పదవి పొందాలని చూశారు. కానీ అది సాధ్యం కాలేదు.
టిడిపిలో చేరాలనుకున్నా..
వాస్తవానికి ఏబీ వెంకటేశ్వరరావు టిడిపిలో( Telugu Desam Party) చేరాలని అనుకున్నారు. కానీ చంద్రబాబు పట్టించుకోలేదు. ఆయనపై ఒత్తిడి కోసం తిరుగుబాటు తరహా వ్యవహారాలు ప్రారంభించారు. దీంతో చంద్రబాబు అసలు పట్టించుకోని స్థితికి వెళ్ళింది పరిస్థితి. అందుకే ఇప్పుడు కొత్తగా పార్టీ పెడతానని ప్రకటించినట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వైసిపి హయాంలో బాధితుడిగా మిగిలారు వెంకటేశ్వరరావు. కీలకమైన పదవి లేదా రాజకీయ ప్రాధాన్యత దక్కుతుందని భావించారు. కానీ అటువంటిదేమీ జరగకపోవడంతో అవమానంగా భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు సొంత పార్టీ అంటూ హడావిడి చేస్తున్నారు. వాస్తవానికి పోలీస్ శాఖకు సంబంధించిన నామినేటెడ్ పదవి ఆయనకు ఇచ్చారు. కానీ అది తన స్థాయికి తగ్గట్టు కాదని భావించి తిరస్కరించారు.
ఉన్నఫలంగా చర్యలకు డిమాండ్..
జగన్మోహన్ రెడ్డితో( Jagan Mohan Reddy) పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై చర్యలు తీసుకోవడం విషయంలో టిడిపి కూటమి ప్రభుత్వం వెనుకబడింది అన్నది వెంకటేశ్వరరావు ఆవేదన. ఇటీవల మెగా ఇంజనీరింగ్, షిరిడీసాయి వంటి సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ హయాంలో జరిగిన ఘోరాలకు ఇప్పుడు శిక్షలు వేయాలని కోరుతున్నారు. కానీ ఉన్నఫలంగా చర్యలు తీసుకుంటే అవి రాజకీయంగా ఎంత ఇబ్బందులు తెచ్చి పెడతాయో తెలుసు. అయితే ఏబి వెంకటేశ్వరరావు కోరినది కాకపోవడంతో ఆయన టిడిపి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. పిరికి ప్రభుత్వం అని ముద్ర వేస్తున్నారు. ఇన్ డైరెక్ట్ గా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు కొత్త పార్టీ అంటూ హడావిడి చేస్తున్నారు. ఆయన పార్టీ ఎంత మాత్రం ఉనికి చాటుకునే అవకాశం లేదని.. కేవలం చంద్రబాబును బ్లాక్ మెయిలింగ్ చేసేందుకే నన్న టాక్ ఉంది.