Homeఆంధ్రప్రదేశ్‌Kesineni Nani: టీడీపీకి రాజీనామా.. చంద్రబాబుకు షాకిచ్చిన సీనియర్

Kesineni Nani: టీడీపీకి రాజీనామా.. చంద్రబాబుకు షాకిచ్చిన సీనియర్

Kesineni Nani: తెలుగుదేశం పార్టీకి షాక్. విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. త్వరలో ఢిల్లీ వెళ్లి లోక్ సభ సభ్యత్వంతో పాటు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని స్వయంగా ప్రకటించారు. గత కొద్ది రోజులుగా ఆయన టిడిపికి దూరంగా ఉన్నారు. పార్టీ కార్యకలాపాల్లో అంటీ ముట్టునట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ చంద్రబాబుతో స్నేహం కొనసాగిస్తూ వచ్చారు.కానీ పార్టీకి విరుద్ధ ప్రకటనలు చేస్తూ చికాకు తెప్పించారు.అందుకే చంద్రబాబు నేరుగా దూతలను పంపించి ఇక తగ్గిపోండి.. టిడిపి కార్యక్రమాల్లో మీ జోక్యం వద్దంటూ సూచించడంతో కేశినేని నాని మనస్తాపానికి గురయ్యారు. తన అవసరం లేనప్పుడు.. పార్టీలో ఉండడం అనవసరం అంటూ నాని వ్యాఖ్యానించారు.

2014,2019 ఎన్నికల్లో కేశినేని నాని విజయవాడ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే రెండోసారి గెలిచిన తర్వాత నాని స్వరం మారింది. స్థానిక టిడిపి నాయకులతో విభేదాలు పెట్టుకున్నారు. పార్టీ నిర్ణయాలను సైతం పాటించడం మానేశారు. టిడిపి కార్యాలయం పై దాడి చేసినప్పుడు కనీసం స్పందించలేదు. లోకేష్ పాదయాత్రకు దూరంగా ఉన్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో పార్టీ కంటే తానే గొప్ప అని.. తానే గెలిపించుకుంటానని సవాల్ చేశారు. పార్టీకి చాలా విధాలుగా డ్యామేజ్ చేశారు. అయినా చంద్రబాబు ఏనాడు ఆగ్రహం వ్యక్తం చేయలేదు. పైగా కేశినేని నాని కుమార్తె వివాహానికి కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

కృష్ణాజిల్లా టిడిపి నాయకులతో కేశినేని నానికి పడదు. పార్లమెంట్ నియోజకవర్గం లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను.. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలతో ఆయనకు తీవ్ర విభేదాలు ఉన్నాయి. వారితో సయోధ్య కుదుర్చుకోలేదు. పైగా అగ్నికి ఆజ్యం పోస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. ముఖ్యంగా ఆయన సోదరుడు కేశినేని చిన్ని అంటే పడడం లేదు. ఆయనకు లోకేష్ ప్రోత్సాహం అందిస్తున్నారని నాని అనుమానించారు. ఇటీవల తిరువూరులో చంద్రబాబు సభకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఫ్లెక్సీలో తన ఫొటో లేదని, తానే కార్యక్రమం నిర్వహిస్తానని రచ్చ చేశారు. దీంతో ఇది చంద్రబాబుకు కోపం తెప్పించింది. పార్టీ కార్యక్రమాల నుంచి తప్పుకోవాలని చంద్రబాబు కొందరు పార్టీ నేతల ద్వారా కేశినేని నానికి సమాచారం అందించారు.

అయితే సమాచారం అందుకున్న నాటి నుంచి కేశినేని నాని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. సోషల్ మీడియా ద్వారా భిన్నంగా స్పందిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా పార్టీ నుంచి బయటకు వెళ్ళనున్నట్లు తెలిపారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారు అన్నది తెలియడం లేదు. ఫిబ్రవరిలో తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఆయనకు వైసీపీ నుంచి ఆహ్వానం ఉంది. మరోవైపు ఆయన బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది. తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసిన గెలుపు పొందుతానని చాలా సందర్భాల్లో నాని చెప్పుకొచ్చారు. కేశినేని నాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో? ఏ పార్టీలో చేరుతారో? అన్నది మాత్రం ఆసక్తిగా మారింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version