Sajjala Ramakrishna Reddy: సజ్జలపై క్రిమినల్ కేసు.. ఎక్కడో తేడా కొడుతోంది!

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీపై కోపంతో.. ఎన్నికల నిర్వహణపరంగా వైసీపీకి కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచింది. కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా సహకారం అందించింది.

Written By: Dharma, Updated On : May 31, 2024 4:15 pm

Sajjala Ramakrishna Reddy

Follow us on

Sajjala Ramakrishna Reddy: ‘ఏపీలో ఏదో జరుగుతోంది. అధికార పార్టీపై కుట్ర జరుగుతోంది. ఎన్నికలు కూడా సక్రమంగా నిర్వహించలేదు. అధికార యంత్రాంగమంతా కూటమికి అనుకూలంగా పనిచేసింది. మా జిల్లా కలెక్టర్ మాకు సహకరించలేదు. కూటమికి సహకారం అందించారు. మా నియోజకవర్గంలో రెండు చోట్ల రిగ్గింగ్ జరిగింది. అక్కడ రీపోలింగ్ నిర్వహించాలి. టిడిపి శ్రేణులు చాలా చోట్ల హింసను ప్రోత్సహించాయి. వారిపై ఎందుకు కేసులు లేవు?’ అధికార వైసీపీ శ్రేణుల నుంచి వినిపించిన మాటలు ఇవి. పోలింగ్ ముగిసిన నాటి నుంచి ఈ అంశాల చుట్టూ రాజకీయాలు నడిపారు వైసీపీ నేతలు. అయితే రోజురోజుకు వైసిపి నేతల నుంచి ఈ తరహా నిట్టూర్పు మాటలు వినిపిస్తుండడంతో.. వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీపై కోపంతో.. ఎన్నికల నిర్వహణపరంగా వైసీపీకి కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచింది. కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా సహకారం అందించింది. ఆ ఎన్నికల్లో వైసీపీ చెప్పిందే వేదం.. చేసిందే చట్టం అన్నట్టుగా పరిస్థితి కొనసాగింది. ఫలితంగా మంచి విజయాన్ని అందుకుంది వైసిపి. కానీ ఈ ఎన్నికల్లో ఆ పరిస్థితి లేదు. నోటిఫికేషన్ వచ్చిన నుంచి.. నేటి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటు ఉత్తర్వుల వరకు అన్ని కూటమికి అనుకూలంగానే ఉన్నాయి. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది.

గత ఐదు సంవత్సరాలుగా సజ్జల రామకృష్ణారెడ్డి సుప్రీం గా వ్యవహరించారు. పేరుకే మంత్రులు కానీ.. సూపర్ పవర్ ను సజ్జలకు కట్టబెట్టారు జగన్. మొత్తం వ్యవస్థలపై పట్టు సాధించారు సజ్జల. ముఖ్యంగా పోలీస్ శాఖ సజ్జల కనుసన్నల్లో నడిచిందని విపక్షాల నుంచి ఒక ఆరోపణ ఉంది. అయితే అటువంటి సజ్జలపైనే ఈరోజు క్రిమినల్ కేసు నమోదు కావడం గమనార్హం. దీంతో ఏపీలో ఏదో జరుగుతోందన్న అనుమానం సగటు వైసీపీ శ్రేణుల్లో ప్రారంభం అయింది. వైసిపి గెలుపు అన్నమాట మేకపోతు గాంభీర్యం అని నిర్ధారణకు వస్తున్నారు.

అయితే ఇన్ని రోజులపాటు సజ్జల బహిరంగంగా వ్యాఖ్యానాలు చేసినా.. అనుచిత మాటలు అన్నా.. పోలీసులు పెద్దగా రెస్పాండ్ కాలేదు. ఎవరైనా ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఓ అంతర్గత సమావేశంలో సజ్జల చేసిన కామెంట్స్ పై పోలీసులు స్పందించారు. క్రిమినల్ కేసును నమోదు చేశారు. రూల్స్ పాటించేవారు కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్లవద్దని.. ఆర్గ్యుమెంట్ చేసేవారు మాత్రమే వెళ్లాలని సజ్జల వైసిపి సమావేశంలో వ్యాఖ్యానించారు. దీనిపై టిడిపి నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఫిర్యాదు చేసిన మరుక్షణం పోలీసులు సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఏంటీ మార్పు అంటూ వైసీపీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేశాయి. తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానంతో సతమతమవుతున్నాయి.