Land Registration: ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. అక్టోబర్ నుంచి గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకునేలా నిర్ణయం తీసుకుంది. పది లక్షల రూపాయల విలువ కలిగిన భూములకు 100 రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకునే వేసులుబాటు కల్పించింది. అంతకుమించి అయితే వేయి రూపాయల రుసుము తీసుకోనుంది. గ్రామ సచివాలయాల్లోనే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. దీని ద్వారా ప్రజలకు మరింత సులువైన సేవలు అందించినట్టు అవుతుంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వారికి ఇది నిజంగా ఆనందించదగ్గ విషయమే.
* లక్షలాదిమంది జీవించి లేరు..
ప్రస్తుతం రాష్ట్రంలో భూమి కలిగిన పట్టాదారుల్లో లక్షలాదిమంది జీవించలేరు. కానీ వారి పేర్లతో ఇప్పటికీ పట్టాలు కొనసాగుతున్నాయి. ఇది భూ హక్కుదారులకు ఇబ్బందికరమే. వెబ్ లాండ్ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో 85, 41,002 మంది పట్టాదారులు ఉన్నారు. వారిలో 3,91,405 మంది ఇప్పటికే మరణించారు. అంటే మొత్తం పట్టాదారుల్లో 4.58 శాతం మంది జీవించలేరు అన్నమాట. ఈ భూములు వారసుల స్వాధీనంలోనే ఉన్నా వారి పేర్లతో బదిలీ కాకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. భూ బదలాయింపులకు గాను తక్కువ రుసుముతో గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ జరిగేలా చర్యలు చేపట్టింది. అక్టోబర్ నుంచి ఈ కొత్త విధానం అమలు కానుంది.
* సామాన్యులపై భారం..
వారసత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఒక శాతం స్టాంప్ రుసుము చెల్లించాలి. దశాబ్దాలుగా తమ వద్ద ఉన్న భూములను మళ్లీ రుసుము కట్టాలన్న ఆవశ్యకత ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. అయితే అంత మొత్తంలో భరించలేని వారు ఉన్నారు. కుటుంబ సభ్యుల మధ్య వాటాల సమస్యలు తేలక పోవడం వల్ల రిజిస్ట్రేషన్లు ముందుకు సాగలేదు. భూమి బదలాయింపు కాకపోవడంతో చాలామందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కడం లేదు. రైతు భరోసా వంటివి వర్తింపు కావడం లేదు. బ్యాంకు రుణాలు లభించడం లేదు. అవసరానికి భూమి విక్రయించేందుకు అవకాశం లేకుండా పోతోంది. అందుకే సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానం అమలయితే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందికి ప్రయోజనం కలగనుంది.
* భారం తప్పదు..
అయితే సచివాలయాల్లో వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అక్కడ సిబ్బందికి శిక్షణ, కంప్యూటర్లు, పరికరాలు అవసరం అవుతాయి. అయితే వారానికి ఒకటి రెండు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉంది. అయితే సచివాలయాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు భారీగా ఖర్చు కానుంది. ప్రజలకు సులభతరం చేసే పనిలో భాగంగా ప్రభుత్వంపై ఇప్పుడు ఆర్థిక భారం పడనుంది. అందుకే దీనిపై అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. కానీ గత ఏడాదిలో భారీగా వచ్చిన ఫిర్యాదులతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే గ్రామ సచివాలయాల్లో ఈ రిజిస్ట్రేషన్ ఎంత వరకు విజయవంతం అవుతుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి.