https://oktelugu.com/

Aid to flood victims : వెల్లివిరిసిన మానవత్వం.. విజయవాడకు రికార్డ్ స్థాయిలో ఆహారం!

సాటి మనిషి కష్టాల్లో ఉంటే సహించలేం. వారికి తమ వంతుగా సాయం అందిస్తాం. భారతదేశంలో మానవ సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. ఇప్పుడు విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో అదే కనిపిస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : September 3, 2024 / 04:11 PM IST

    Vijayawada Flood Victims

    Follow us on

    Aid to flood victims : విపత్కర పరిస్థితుల్లో మానవీయత చూపించాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉంది. ఈ విషయంలో భారతదేశం ముందుంటుంది. భారతీయులు సేవా దృక్పథంతో ఉంటారు. ముంబై బాంబు బ్లాస్టింగ్ సమయంలో ఎంతోమంది చనిపోయారు. మరికొందరు క్షతగాత్రులు అయ్యారు. అటువంటి సమయంలో కూడా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి స్వచ్ఛందంగా రక్తం ఇచ్చేందుకు జనం ఎగబడ్డారు. రక్తం అవసరమని సోషల్ మీడియాలో ఎటువంటి వార్త వచ్చిన చాలామంది స్పందిస్తుంటారు. అటువంటి స్పందన ఇప్పుడు విజయవాడ వరద సందర్భంగా కనిపిస్తోంది. బాధితులను కడుపు నింపేందుకు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల ప్రజలు ఏకమవుతున్నారు. పెద్ద ఎత్తున ఆహారం అందించేందుకు సిద్ధపడుతున్నారు. ఎవరికి తోచినట్టు వారు ఆహార పొట్లాలు, అల్పాహారం, కాగునీరు అందిస్తున్నారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలోని మిగతాప్రాంతాల్లోని హోటల్ యజమానులు లక్ష మందికి అల్పాహారం.. మధ్యాహ్నం, రాత్రికి లక్ష చొప్పున ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. బస్సులు, వివిధ వాహనాల్లో వాటిని తరలిస్తున్నారు. విజయవాడ చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి బాధితుల కోసం పులావ్, పులిహోర, పాలు, తాగునీరు, రొట్టెలు, బిస్కెట్ ప్యాకెట్లు.. వాహనాల్లో వస్తూనే ఉన్నాయి.అయితే విజయవాడలో సేఫ్ జోన్ లో ఉన్న ప్రాంతాల నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఆహారాన్ని తీసుకొచ్చి బాధితులకు అందజేస్తుండడం విశేషం. ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయం నుంచి బాధితులకు 5000 ఆహార పొట్లాలు పంపించారు.

    * హెలిక్యాప్టర్లు, డ్రోన్ల ద్వారా పంపిణీ
    మరోవైపు విజయవాడలో హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహార పంపిణీ జరుగుతోంది. చాలా ప్రాంతాల్లో ఇంకా ముంపు బారినే ప్రజలు ఉన్నారు. ఇళ్లపై అంతస్తులో తలదాచుకుంటున్నారు. అటువంటి వారికి వాయు మార్గంలో ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ నగరంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో మూడు టన్నులకు పైగా ఆహార పదార్థాలు అందజేసినట్లుముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. దాదాపు రహదారులన్నీ జలమయం కావడంతో బోట్లు ద్వారా రాకపోకలు కొనసాగుతున్నాయి. వాటిలోనే ఆహారం తీసుకెళ్లి డ్రోన్ల సాయంతో బాధితులకు అందజేస్తున్నారు.

    * విరాళాల వెల్లువ
    మరోవైపు వరద బాధితులకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వెంకయ్య నాయుడు కుటుంబం సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. రెండు రాష్ట్రాలసహాయనిధికి తన పింఛన్ నుంచి ఐదు లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు వెంకయ్య నాయుడు. అలాగే ముప్పవరపు ఫౌండేషన్ తరపున ఇరు రాష్ట్రాలకు ఐదు లక్షలు అందించారు. అలాగే స్వర్ణ భారతి ట్రస్ట్ నుంచి కూడా ఐదు లక్షల కేటాయించారు. ఈ రెండు సంస్థలు వెంకయ్య నాయుడు కుటుంబ సభ్యులు. మరోవైపుజూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల రూపాయల చొప్పున సాయంగా ప్రకటించారు. మొత్తం కోటి రూపాయల సాయాన్ని అందించారు. విశ్వక్సేన్ పది లక్షల విరాళం ప్రకటించారు. వైజియంతి మూవీస్ అధినేత అశ్విని దత్ సైతం సాయానికి ముందుకు వచ్చారు. 25 లక్షల రూపాయలు ప్రకటించారు. ఇంకా చాలామంది ప్రముఖులుసాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఒకవైపు బాధితులకు ఆహారం, ఇంకోవైపు విరాళాలు వెల్లువలా వస్తుండడం ఆహ్వానించదగ్గ పరిణామం.

    * పంపిణీలో జాప్యం
    అయితే వరద బాధిత ప్రాంతాల్లో ఆహార పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. దీనిపైనే సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులు వచ్చాయి. కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఆహార పంపిణీలో జాప్యం చేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై నివేదిక కోరారు సీఎం చంద్రబాబు. ఒకవైపు ప్రభుత్వపరంగా, మరోవైపు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆహార పొట్లాలు విజయవాడ పంపించడం విశేషం.