Ramoji Rao Vs Jagan: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. “ఆ రెండు పత్రికల్లో” ప్రధాన పత్రికైన “ఈనాడు” నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని తెగ విమర్శించేది. వాస్తవానికి ఈనాడుకు కాంగ్రెస్ అంటే పడదు. అదేంటో గాని.. అప్పట్లో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి కేవలం వైయస్ రాజశేఖర్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ఈనాడు వార్తలు రాసేది. ప్రభుత్వంలో ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపించేది. “పెద్దలా భూ గద్దలా”, “భూం”చేశారు, అందిన కాడికి దోచుకున్నారు.. ఇలా చూపుకు ఇంపైన శీర్షికలు పెట్టి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈనాడు తూర్పార పట్టేది. అసలు ఈనాడుకు అంతటి ఆగ్రహం రావడానికి అసలు కారణం మార్గదర్శి మీద వైయస్ దృష్టి సారించడం.. ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా గెలకడం.. వాస్తవానికి చాలామంది రామోజీరావుకు కుంభస్థలం ఈనాడు అనుకుంటారు గానీ.. అస్సలు కానే కాదు.. ఇవాల్టికి రామోజీరావు గ్రూపు సంస్థల్లో లాభాల్లో ఉన్న సంస్థ ఏదైనా ఉందంటే అది మార్గదర్శి మాత్రమే. జగన్ ప్రభుత్వం అంతటి తొక్కుడు తొక్కుతున్నప్పటికీ రామోజీరావు సామ్రాజ్యాన్ని కాపాడుతోంది మార్గదర్శి మాత్రమే.
బ్యాడ్ టైం స్టార్ట్ అయింది
వైయస్ గతించిన తర్వాత మార్గదర్శి విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ పోరాటం చేసినప్పటికీ రామోజీరావు తనకున్న శక్తియుక్తులతో దానిని నిలుపుదల చేయించాడు. కానీ ఎప్పుడైతే జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యాడో.. అప్పుడు రామోజీరావుకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఉండవల్లి అరుణ్ కుమార్ జత కలవడంతో మార్గదర్శి విషయంలో జగన్ వేసిన పాచికలు పారాయి. ఏకంగా సుప్రీంకోర్టు కూడా గతంలో హైకోర్టు వెలువరించిన తీర్పును తప్పు పట్టింది. మరోసారి సమీక్షించాలని కోరింది. దీంతో ఇప్పటిదాకా రామోజీరావు అండ్ కో మాట్లాడుతున్న మాటలు.. ప్రచురించిన వార్తలు మొత్తం బూటకం అని తేలిపోయింది. సో మరి కొద్ది రోజుల్లో మార్గదర్శి అసలు రూపం బయటపడుతుంది.

తన మానస పుత్రిక అయిన మార్గదర్శిని జగన్ ఇబ్బంది పెడుతుంటే రామోజీరావు ఊరుకోడు కదా.. అందుకే తన ఈనాడులో రాతలు రాయిస్తున్నాడు. ఒకటి, రెండు కాదు.. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ముంబాయి, ఢిల్లీ ఎడిషన్ల లో పదులకొద్దీ నెగిటివ్ వార్తలు జగన్ పై రాయిస్తున్నాడు. గతంలో జగన్ ప్రభుత్వం మీద ఒకటి లేదా రెండు నెగిటివ్ వార్తలు మాత్రమే ఈనాడులో ప్రచురితమయ్యేవి. కానీ ఇప్పుడు అలా కాదు.. అసలే ఎన్నికల కాలం.. టిడిపికి జీవన్మరణ సమస్య.. ఆ లెక్కన ఈనాడు ది కూడా అదే పరిస్థితి.. అందుకే రామోజీరావు తన విశ్వరూపం చూపిస్తున్నాడు. జగన్ ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలలో జరిగిన ప్రతి విషయాన్ని నెగటివ్ కోణంలో చూపిస్తున్నాడు.
గురువారం నాటి ఈనాడు ఏపీ, ఇతర మెట్రో ఎడిషన్ల లో రోడ్లు, ఐటీ పాలసీ వంటి వాటి మీద ఈనాడు వార్తలు కుమ్మి పడేసింది. ఇక రంజాన్ సందర్భంగా ముస్లింలను జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడంటూ.. ఓ కథనాన్ని రాసి పడేసింది. మరి ఈ స్థాయిలో నెగటివ్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. టిడిపి గెలుస్తుందా? ఈనాడు రాసిన రాతల వల్ల జగన్ ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుందా? గత ఎన్నికల్లోనూ ఈనాడు ఇదేవిధంగా రాసింది. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. ఆయన హయాంలో చేసిన పనులను వదిలిపెట్టి.. కేవలం జగన్మోహన్ రెడ్డి ని లక్ష్యంగా చేసుకొని వార్తలు రాసింది. కానీ అప్పుడు ఎలాంటి ఫలితం వచ్చిందో అందరికీ తెలిసిందే. అప్పటిలాగే ఇప్పుడు కూడా ఈనాడు అదేవిధంగా ప్రచారం చేస్తోంది.. మరి కొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి.. ఫలితం అనేది ఓటర్ల చేతిలో ఉంది. టిడిపి గెలుస్తుందా? వైసిపి గెలుస్తుందా? అనేది పక్కన పెడితే.. మీడియా మీడియా లాగా ఉండకుండా.. ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుండడమే అసలైన విధి వైచిత్రి.